ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీ, కంప్యూటర్ గేమ్స్, ఎడ్యుకేషన్ యాప్స్ పెరుగుదల కారణంగా పిల్లలు, టీనేజర్స్ ఎక్కువగా వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి గాడ్జెట్స్ స్క్రీన్‌  చూస్తూ సమయం గడుపుతున్నారు. ఇలా చేయడం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.


3 గంటల కంటే ఎక్కువ సేపు ఫోన్ చూస్తే ఇబ్బందులు తప్పవు!


బ్రెజిలియన్ పరిశోధకుల అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. హెల్త్‌ కేర్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన కథనం ప్రకారం, వెన్నెముక ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రమాద కారకాలను గుర్తించింది. రోజుకు 3 గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం, స్క్రీన్‌కు దగ్గరగా ఉండటం, పొట్ట మీద పడుకోని చూడటం లాంటి వల్ల తీవ్ర ముప్పుతప్పదని తెలిపింది.  ఈ అధ్యయనం థొరాసిక్ వెన్నెముక నొప్పి (TSP) పై  కీలక దృష్టి పెట్టింది. థొరాసిక్ వెన్నెముక ఛాతీ వెనుక భాగంలో, ఎక్కువగా భుజం బ్లేడ్‌ల మధ్య ఉంటుంది. మెడ దిగువ నుండి నడుము వెన్నెముక ప్రారంభం వరకు విస్తరించి ఉంటుంది.


సర్వేలో ఏం తేలిందంటే?


సావో పాలో రాష్ట్రంలోని మధ్య తరహా నగరమైన బౌరులోని హైస్కూల్ మొదటి, రెండవ సంవత్సరాల్లో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలు, అబ్బాయిలను సర్వే చేసి వివరాలను సేకరించారు. ఈ సర్వేలో 1,628 మంది మార్చి-జూన్ 2017లో తొలిసారి పాల్గొన్నారు.  వీరిలో 1,393 మందితో 2018లో తదుపరి సర్వే కంప్లీట్ చేశారు. వీరిలో 38.4 శాతం మంది వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులోనూ అబ్బాయిల కంటే ఎక్కువ మంది అమ్మాయిలు TSPతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. TSP అనేది ప్రపంచ వ్యాప్తంగా సాధారణ జనాభాలోని వివిధ వయస్సుల వర్గాల్లో ఉంటుంది. సాధారణంగా పెద్దవారిలో 15 శాతం నుంచి 35 శాతం, పిల్లలు, టీనేజర్స్ లో 13 శాతం నుంచి 35 శాతం వరకు ఉంటుంది. COVID-19 మహమ్మారి సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం భారీగా పెరగడంతో ఈ సమస్య మరింత పెరిగినట్లు తేలింది. TSPతో  భౌతిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  వెన్నెముక ఆరోగ్యంపై శారీరక శ్రమ, రోజువారీ అలవాట్లు, మానసిక రుగ్మతల ప్రభావాలున్నాయి.    


టీనేజర్స్ లో TSP సమస్య తగ్గాలంటే?


అంతేకాదు, హైస్కూల్ విద్యార్థులలో TSP సమస్య కారణంగా వెన్నునొప్పి ఎక్కువగా కలిగి ఉన్నారు.  విద్యా పరంగానూ వెనుకబడి ఉంటున్నారు. ఎక్కువ మానసిక  సమస్యలను కలిగి ఉంటున్నారు. వీటికి అదనంగా, ఇతర ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తినట్లు వెల్లడి అయ్యింది. వీలైనంత వరకు పిల్లలు, టీనేజర్స్ స్మార్ట్ ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించడం వలన TSP సమస్యను తగ్గించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కొనసాగిస్తే, పలు వెన్ను, మెడ నొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. అందుకే టీనేజర్స్ స్మార్ట్ ఫోన్ వినియోగం విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వెల్లడించారు.