Samsung Galaxy XCover 7 India Launch: కొరియన్ కంపెనీ శాంసంగ్ త్వరలో మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేయనుందని సమాచారం. ఇటీవలే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. కానీ త్వరలో లాంచ్ చేసే ఫోన్ మాత్రం శాంసంగ్ ఇంతవరకు మనదేశంలో లాంచ్ చేసిన ఫోన్ల లాంటిది కాదు. అదే శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 7. ఇది ఒక రగ్డ్ ఫోన్ కావడం విశేషం. గిజ్మో చైనా కథనం ప్రకారం SM-G556B అనే మోడల్ నంబర్ ఉన్న శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 2023 నవంబర్‌లో బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. మలేషియా, థాయ్‌ల్యాండ్ దేశాల్లో ఈ ఫోన్ ఇప్పటికే సర్టిఫికేషన్ పొందింది.


శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 7 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఈ శాంసంగ్ రగ్డ్ స్మార్ట్ ఫోన్ ఐపీ68 రేటింగ్‌ను పొందింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ లభించనుంది. ఈ ఫోన్‌ను రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించవచ్చు. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. గ్లోవ్స్ వేసుకుని కూడా ఉపయోగించేలా ఎన్‌హేన్స్‌డ్ టచ్ సెన్సిటివిటీ కూడా ఉంది. ఐపీ68 డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది.


ఆక్టాకోర్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 7 స్మార్ట్ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 7లో అందించనున్నట్లు సమాచారం. ముందు వెర్షన్ల తరహాలోనే మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను కూడా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. 4050 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఎక్స్‌కవర్ సిరీస్‌లో 5జీ కనెక్టివిటీ ఉన్న రెండో ఫోన్ ఇదేనట. 


ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్‌యూఐ 6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 7 ధర
ఈ ఫోన్ ధర విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే దీని ధర రూ.35 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ఉండే అవకాశం ఉంది.


మరోవైపు మోటో జీ ప్లే (2024) స్మార్ట్ ఫోన్ అమెరికాలో లాంచ్ అయింది. ఇంతకు ముందు లాంచ్ అయిన మోటో జీ ప్లే (2023)కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు చాలా అప్‌గ్రేడ్స్ కూడా చేశారు. ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై పని చేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. దీని వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ల ద్వారా ఫొటోలు దిగవచ్చు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!