Samsung A35 5G: శాంసంగ్ తన గెలాక్సీ ఏ-సిరీస్‌లో కొత్త మొబైల్‌ను మనదేశంలో అందుబాటులోకి తెచ్చింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ స్వయంగా తయారు చేసే ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ రెండు ఫోన్లూ రన్ కానున్నాయి. నాలుగు జనరేషన్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. అంటే ఆండ్రాయిడ్ 18 వరకు అప్‌డేట్లు రానున్నాయన్న మాట. దీంతో పాటు ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ కూడా అందించనున్నారు.


శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ధర (Samsung Galaxy A35 5G Price in India)
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గానూ నిర్ణయించారు. అసమ్ ఐస్ బ్లూ, అసమ్ నేవీ, అసమ్ లిలాక్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ అందుబాటులో ఉంది.


మార్చి 18వ తేదీ నుంచి ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, వన్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 డిస్కౌంట్ లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈఎంఐ ఆప్షన్లు రూ.1,732 నుంచి ప్రారంభం కానున్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్పెసిఫికేషన్లు (Samsung Galaxy A35 5G Specifications)
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్... ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్‌యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది. ఏకంగా నాలుగు జనరేషన్ల పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌ను అందించనున్నట్లు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఫీచర్ కూడా ఇందులో ఉంది.


1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లు కూడా శాంసంగ్ అందించడం విశేషం. స్క్రీన్‌కు ప్రొటెక్షన్ అందించడానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్ 5 ఎన్ఎం ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌పై పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ ఇందు‌లో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 


శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రధాన కెమెరాగా ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌లను కెమెరా సెటప్‌లో చూడవచ్చు. ముందువైపు అందించిన 13 మెగాపిక్సెల్ లెన్స్ ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.


ఈ ఫోన్ కొనుగోలు చేశాక ఇందులో మీరు స్టోర్ చేసుకునే డేటాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ఫీచర్ ఉంది. నీటి నుంచి, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపీ67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీలో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌కు వెనకవైపు గ్లాస్ ఫినిష్‌ను అందించడం విశేషం.


Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?