ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య కేసులో గుంటూరు పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న.. గీతాంజలి కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి గురువారం (మార్చి 14) విలేకరుల సమావేశం నిర్వహించారు. 


తెనాలి గీతాంజలి కేసులో సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో రాంబాబు, వెంకట దుర్గారావు అనే ఇద్దరు అనుచిత పోస్టింగ్ లను పెట్టారని అన్నారు. వారు ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. వారిని రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్ వల్ల మహిళలు, యువత ఎటువంటి ఆత్మన్యూనతకు గురికావద్దని ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు.


ఎవరైనా సరే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో ట్రోలింగ్ కు పాల్పడితే దిశ స్టేషన్ ను కానీ, తమ హెల్ప్ లైన్ నెంబర్ 9154880389 ను సంప్రదించాలని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. 


బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు అందజేత
ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల ఆర్థిక సాయం చెక్కును ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అందజేశారు. గీతాంజలి ఇద్దరు ఆడ పిల్లలు పేరిట చెరి ఒక రూ.పది లక్షలను ప్రభుత్వం డిపాజిట్ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. గీతాంజలి భర్త, పిల్లలకు చెక్కు అందజేసి ధైర్యం చెప్పినట్లుగా ఎమ్మెల్యే శివకుమార్ వెల్లడించారు.