ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక సాధారణ సమావేశాన్ని (AGM) ఆగస్టు 29న నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.  దేశంలో రిలయన్స్ జియో 5G సేవలు ప్రారంభించడం సహా  JioPhone 5G  లాంచ్ గురించి  ప్రకటన చేసే అవకాశం ఉంది. వినియోగదారుల కోసం 5G సేవలు ఎప్పుడు ప్రారంభిస్తారు?  ఈ సేవలు ఎప్పటి నుంచి  అందుబాటులోకి వస్తాయి? అనే వివరాలను ముఖేష్ అంబాని వెల్లడించే అవకాశం ఉంది. అక్టోబర్‌లో 5జీ సేవలను కమర్షియల్‌ గా ప్రారంభించనున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ ప్రకటను చేయనున్నట్లు తెలుస్తున్నది.


వేలంలో టాప్బిడ్డర్


అటు 5జీ సేవ‌ల ప్రారంభానికి అవ‌స‌ర‌మైన 5జీ స్పెక్ట్రం వేలంలో  సుమారు రూ.87,000 కోట్ల (11 బిలియ‌న్ల డాల‌ర్లు)తో రిల‌య‌న్స్‌ కొనుగోలు బిడ్‌లు దాఖ‌లు చేసింది. వేలంలో టాప్‌ బిడ్డర్‌ గా నిలిచింది. తొలి ద‌శ‌లో ఈ 5జీ సేవలను న్యూఢిల్లీ, చండీగఢ్, గుర్గావ్, ముంబై, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్‌ నగర్, పుణె, లక్నో, కోల్‌ కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో అందుబాటులోకి  తీసుకురాననుంది.   


JioPhone 5G  ఎలా ఉండొచ్చంటే?


Jio 5G సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యం జియో 5 ఫోన్ ను సైతం జియో తీసుకురాబోతుంది. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను ఏజీఎంలోనే ప్రకటించే  అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరతో పాటు ఎప్పుడు విడుదల చేస్తారు? అనే విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. విశ్వసనీయ సమచారం ప్రకారం  JioPhone 5G స్మార్ట్‌ ఫోన్ రూ. 12,000 లోపు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం  2021లో వచ్చిన JioPhone నెక్స్ట్‌ మాదిరిగానే, తక్కువ ధరకు ఈ 5G స్మార్ట్‌ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ ఫోన్ కు జియో కంపెనీ ఈజీ ఫైనాన్సింగ్  ఆప్షన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు.


JioPhone 5G  ప్రత్యేకతలు


ఈ JioPhone 5G   ఆండ్రాయిడ్‌ 11 (గో ఎడిషన్‌)తో పని చేయనున్నట్లు తెలుస్తున్నది.  ఈ ఫోన్ ధర   రూ.9 వేల నుంచి రూ.12 వేల ఉండవచ్చని సమాచారం.  6.5 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. 13 మెగా పిక్సల్‌ మెయిన్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌సెన్సర్‌, టైప్‌- సి పోర్ట్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 29న ఈ ఫోన్ కు సంబంధించన మరిన్ని వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ AGM  మీద జనాల్లో ఆసక్తి నెలకొంది.


మార్కెట్లో సంచలనం జియో


రిలయన్స్ జియో మార్కెట్లోకి అడుగు పెట్టిన తర్వాత వినియోగదారులకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొద్ది రోజుల్లోనే జియో రికార్డు స్థాయిలో కస్టమర్లను సంపాదించుకుంది. జియో నుంచి రిలీజ్ అయిన ఫోన్లు సైతం మంచి ఆదరణ దక్కించుకున్నాయి.  5జీ సేవల  ప్రారంభం, 5జీ ఫోన్ విడుదలతో మార్కెట్లో మరింతగా విస్తరించే అవకాశం ఉంది.