రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ ధర లాంచ్‌కు ముంగిట ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ కొత్త రెడ్‌మీ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఇప్పటికే లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 11ఎస్‌లో 90 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది.


రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర (అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉండనుంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.19,999కు విక్రయించనున్నారని తెలుస్తోంది.


ఈ ఫోన్ ఇటీవలే గ్లోబల్ లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 11ఎస్ 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ గ్లోబల్ వేరియంట్ ధరను 249 డాలర్లుగా (సుమారు రూ.18,700) నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 279 డాలర్లుగా (సుమారు రూ.21,000) ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 299 డాలర్లుగా (సుమారు రూ.22,500) ఉంది.


రెడ్‌మీ నోట్ 11ఎస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్‌ను అందించనున్నారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.


128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో అందించనున్నారు. 4జీ ఎల్టీఈ, వైఫై, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఇందులో ఉండనున్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా.. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.