రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారు. కోవిడ్ వ్యాప్తి పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజు వారీ కేసులు అధికంగా నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారు కూడా దాదాపు చికిత్సతో కోలుకుంటున్నారన్నారు. పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 1.09 లక్షలకు పైగా కేసుల్లో కేవలం 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని అధికారులు వెల్లడించారు. ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమేనన్నారు. దాదాపుగా వీళ్లంతా కోలుకుంటున్నారని అధికారులు సీఎంకు వివరించారు. 


ఆరోగ్య శ్రీ అమలు ఓ విప్లవాత్మక చర్య


ఆస్పత్రుల్లో చేరినవారికి కూడా 93 శాతం మంది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వారికి 90.34 శాతం రెండు డోసుల వాక్సినేషన్‌ పూర్తయ్యిందని పేర్కొన్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి 98.91 శాతం మొదటి డోస్‌ పూర్తయ్యిందని వెల్లడించారు. అన్నిజిల్లాల్లో పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ కు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ కోర్‌ సెంటర్లలో ఉన్నవారికి మంచి సదుపాయాలు కల్పించాలన్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పూర్తిస్థాయిలో అందించాలన్నారు. కోవిడ్‌ చికిత్సలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అడ్వైజరీస్‌ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ అమలు దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలన్నారు. విప్లవాత్మక చర్యగా ఆరోగ్యశ్రీని అమలుచేస్తున్నామన్నారు. దేశం మొత్తానికి ఆదర్శనీయంగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తున్నామన్నారు. 


దేశానికే ఆదర్శంగా కార్యక్రమాలు


బీమా సంస్థల రేట్లకన్నా ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు అధికంగా చెల్లిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. జీఎంపీ ప్రమాణాలు ఉన్న మందులనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్నామన్నారు. నాడు–నేడు కింద గతంలో ఎప్పుడూ లేని విధంగా డబ్బు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు కాలక్రమేణా దేశానికి ఆదర్శనీయంగా నిలుస్తాయన్నారు. కనీసం 8–10 రోజులు క్షేత్రస్థాయిలో ఉండి ఆరోగ్యశ్రీ అమలుపై ఆరా తీయాలని ఆరోగ్యశ్రీ సీఈవోని సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా ఆరోగ్యశ్రీ మరింత బలోపేతంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.