రియల్‌మీ 9 స్మార్ట్ ఫోన్ సిరీస్, రియల్ టెక్‌లైఫ్ వాచ్ ఎస్100, టెక్‌లైఫ్ బడ్స్ ఎన్100 మనదేశంలో మార్చి 10వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రియల్‌మీ 9 సిరీస్‌లో కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం ఉంది. కొన్ని కథనాల ప్రకారం... ఇందులో మూడు ఫోన్లు కూడా ఉండవచ్చు. రియల్‌మీ 9 4జీ, రియల్‌మీ 9 5జీ, రియల్‌మీ 9 5జీ ఎస్ఈ ఫోన్లు ఈ సిరీస్‌లో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా కంపెనీ టీజ్ చేసింది.
మార్చి 10వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. రియల్‌మీ దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా టీజ్ చేసింది. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
రియల్‌మీ 9 సిరీస్ ధర (అంచనా)
రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్, రియల్‌మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ తెలిపిన దాని ప్రకారం ఈ ఫోన్ల ధర రూ.15 వేలకు పైనే ఉండనుంది. రీజనబుల్ ధరలోనే ఈ ఫోన్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాయని తెలిపింది.
రియల్‌మీ 9 5జీ ఎస్ఈలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778 5జీ ప్రాసెసర్, రియల్‌మీ 9 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవి రెండూ 5జీని సపోర్ట్ చేసే ప్రాసెసర్లే. రియల్‌మీ 9 5జీ ఎస్ఈలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే అందించనున్నట్లు ప్రకటించారు.
తాజాగా వస్తున్న లీకుల ప్రకారం... రియల్‌మీ 9 5జీలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. మిటియోర్ బ్లాక్, స్టార్ గేజ్ వైట్, సూపర్ సోనిక్ బ్లూ, సూపర్ సోనిక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ ఇందులో అందించే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!