Sony PS5 Offer: గేమింగ్ లవర్స్‌కు సోనీ గుడ్ న్యూస్ చెప్పింది. తన గేమింగ్ కన్సోల్ పీఎస్5 ధరను భారీగా తగ్గించింది. ఏకంగా రూ.7,500 తగ్గింపును అందించింది. అయితే ఇది కేవలం డిస్క్ ఎడిషన్‌పై మాత్రమే. డిజిటల్ ఎడిషన్‌పై సోనీ ఎటువంటి తగ్గింపును అందించలేదు. ఇవి లాంచ్ అయ్యాక మొదటి సంవత్సరంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎప్పుడు సేల్‌కు వచ్చినా నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేవి. మొట్ట మొదటి సారి ప్రీ-ఆర్డర్లకు వచ్చినప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తిగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడం విశేషం. తర్వాత ఎన్నిసార్లు సేల్‌కి వచ్చినా వెంటనే స్టాక్ అవుట్ సమస్య మాత్రం కామన్‌గానే వచ్చేది. వినియోగదారుల్లో ఈ గేమింగ్ కన్సోల్‌పై మంచి క్రేజ్ ఉంది.


జులై 25వ తేదీ నుంచి ఎంపిక చేసిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అమెజాన్ ఇండియా, క్రోమా, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, షాప్ఎట్ఎస్సీ, విజయ్ సేల్స్ ఇంకా కొన్ని స్టోర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. జులై 25వ తేదీ నుంచి ఎప్పటివరకు ఆఫర్ అందుబాటులో ఉండనుందో మాత్రం తెలియరాలేదు.


ప్లేస్టేషన్ 5 ధర ప్రస్తుతం మనదేశంలో రూ.54,990గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.49,990 కాగా, తర్వాత రూ.54,990కి పెంచారు. ఇప్పుడు రూ.7,500 తగ్గింపుతో రూ.47,490కే కొనుగోలు చేయవచ్చు. ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,990గా కాగా, ఇప్పుడు రూ.44,990కి పెరిగింది. దీనిపై ఎటువంటి ఆఫర్ అందుబాటులో లేదు. అమెరికాలో పీఎస్5 ధర 499.99 డాలర్లుగానూ(సుమారు రూ.36,700), పీఎస్5 డిజిటల్ ఎడిషన్ ధరను 399.99 డాలర్లుగానూ(సుమారు రూ.29,400) నిర్ణయించారు. యాపిల్ ఐఫోన్ల తరహాలోనే పీఎస్5 ధర కూడా అమెరికా కంటే మనదేశంలోనే ఎక్కువగా ఉంది.


ఈ ప్లేస్టేషన్ 5కు సంబంధించిన డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ ధరను రూ.5,990గానూ, హెచ్‌డీ కెమెరా ధరను రూ.5,190గానూ, పల్స్ 3డీ వైర్‌లెస్ హెడ్‌సెట్ ధరను రూ.2,590గానూ నిర్ణయించారు. దీని ద్వారా గేమ్‌ను లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసే ఆప్షన్ ఉంది. డ్యూయల్ సెన్స్ చార్జింగ్ స్టేషన్ ధర రూ.2,590గా ఉంది. కన్సోల్ కొన్న వారికి డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ (ఒక యూనిట్) కూడా బాక్స్‌లో లభిస్తుంది.


సోనీ ప్లేస్టేషన్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ కూడా ఎక్స్‌బాక్స్ సిరీస్‌లో కొత్త గేమింగ్ కన్సోల్స్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ ధర రూ.34,990గానూ, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ రూ.49,990గానూ నిర్ణయించారు.






Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial