వన్‌ప్లస్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ, ఒప్పో, వివో కంపెనీలు ఇప్పటికే తమ మొట్టమొదటి ట్యాబ్లెట్లను లాంచ్ చేశాయి. ఇప్పుడు వన్‌ప్లస్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో ఈ ట్యాబ్లెట్ మార్కెట్లో లాంచ్ కానుందని సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ దీనికి సంబంధించిన వివరాలను లీక్ చేశారు.


ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం... ఈ ట్యాబ్లెట్ మాస్ ప్రొడక్షన్ కూడా యూరోపియన్ దేశాల్లో ప్రారంభం అయింది. అంటే త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే ఈ ట్యాబ్లెట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించిన వివరాలు త్వరలో బయటకు వస్తాయి. వన్‌ప్లస్ 2022 స్మార్ట్ ఫోన్ లైనప్ వివరాలు కూడా లీకయ్యాయి. వీటి ప్రకారం... వన్‌ప్లస్ 10 ప్రో ఈ నెలలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఏప్రిల్‌లో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ ఏప్రిల్ నెలాఖరులో కానీ, మే ప్రారంభంలో కానీ లాంచ్ కానుంది.


వన్‌ప్లస్ 10ఆర్ మేలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక వన్‌ప్లస్ నార్డ్ 3 (వన్‌ప్లస్ నార్డ్ ప్రో) జులైలో లాంచ్ కానుంది. ఇక వన్‌ప్లస్ 10 అల్ట్రా లేదా వన్‌ప్లస్ 10 ప్రో ప్లస్ స్మార్ట్ ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో లాంచ్ కానుంది. అయితే ఈ లిస్ట్‌కి మరిన్ని మోడల్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది.


వన్‌ప్లస్ 10 ప్రో మనదేశంలో మార్చి 31వ తేదీన లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది.  ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, మరో 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో అందించారు. 


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?