పబ్లిక్ ఫ్రీ వై-ఫైని ఉపయోగించడం ద్వారా స్మార్ట్ ఫోన్లు గతంలో హ్యాకింగ్‌కు గురయ్యేవి. అయితే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌లను ఉపయోగించడం కూడా డేటా చోరీకి దారితీస్తుందని ఒడిశా పోలీసులు ప్రకటించారు. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఉపయోగించవద్దని ప్రజలకు సూచించే సలహాను రాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.


పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ద్వారా ప్రైవసీకి ముప్పు
హ్యాకర్లు పబ్లిక్ ఛార్జర్‌లను మాల్వేర్‌తో లోడ్ చేయగలరని, అలాంటి ఛార్జర్‌లకు USB కేబుల్ ద్వారా ఫోన్‌ను కనెక్ట్ చేయడం ద్వారా డేటాను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించారు. కనెక్ట్ చేసిన ఫోన్ వైరస్ బారిన పడితే, మీ స్మార్ట్ ఫోన్‌లోని సీక్రెట్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి హ్యాకర్లకు అనుమతిస్తుంది.


అయితే మీరు USB చార్జింగ్ పోర్ట్‌ని ఉపయోగిస్తుంటే మాత్రమే మీరు ఇటువంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అయితే చార్జింగ్ అడాప్టర్‌కు ప్లగ్ చేసి నేరుగా ఎలక్ట్రిక్ స్విచ్ ప్లగ్‌ని ఉపయోగిస్తే మీ డేటా సేఫ్‌గానే ఉంటుంది. హ్యాకర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లపై పట్టు సాధించి మీ పేరు మీద నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.


అటువంటి పరిస్థితులను ఎలా నివారించాలి?
యూఎస్‌బీ పోర్ట్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేయబడి ఉంటే, దాదాపు అన్ని ఫోన్‌లు ఇప్పుడు డేటాను బదిలీ చేయడానికి లేదా చార్జింగ్ ప్రారంభించే ముందు వినియోగదారుల నుండి అనుమతిని అడుగుతున్నాయి. ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే వినియోగదారులు మాన్యువల్‌గా అభ్యర్థనను అంగీకరించాలి. అందువల్ల మీరు పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు అనుమతి కోరుతూ ఏదైనా నోటిఫికేషన్ కనిపిస్తే, ఏమి జరుగుతుందో మీరు వెంటనే తెలుసుకోవచ్చు. ఈ అభ్యర్థనను తిరస్కరించి వెంటనే చార్జింగ్ స్టేషన్ నుండి మొబైల్‌ను అన్‌ప్లగ్ చేయండి.


మీరు బయటికి వెళ్లేటపుడు పవర్ బ్యాంక్‌ని మీతో తీసుకెళ్లండి. మీకు ఉన్న మరొక ఆప్షన్ ఏమిటంటే, వాల్ విద్యుత్ సాకెట్ ద్వారా మాత్రమే ఫోన్‌ను ఛార్జ్ చేయడం. అయితే, ఒడిశా పోలీసులు పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.