నోకియా బ్రాండ్ హెచ్ఎండీ గ్లోబల్ ప్రస్తుతం తన జీ-సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ రూపొందించడానికి సిద్ధం అవుతుంది. అదే నోకియా జీ21. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారిక రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


ఈ రెండర్ల ప్రకారం.. ఈ ఫోన్ డార్క్ గ్రీన్, డార్క్ బ్రౌన్, లైట్ గ్రీన్ రంగుల్లో లాంచ్ కానుంది. దీంతోపాటు ఈ నోకియా జీ-సిరీస్‌ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు చూడవచ్చు. ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ ఉండనుంది. ఫోన్ కిందవైపు చిన్ భాగం కాస్త పెద్దగా ఉండనుంది.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను ఎడమవైపు పైభాగంలో అందించారు. ఫోన్ కుడి పక్కభాగంలో వాల్యూమ్ రాకర్లు, పవర్ బటన్ ఉంది. పవర్ బటన్‌లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇక సిమ్ కార్డు స్లాట్ ఫోన్‌కు ఎడమవైపు ఉండనుంది.


నోకియా జీ21 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ఫోన్ గతవారంలో గీక్ బెంచ్ డేటాబేస్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్ ఉండనుంది. దీని బేస్ ఫ్రీక్వెన్సీ 1.61 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 312 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1157 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది.


ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. హెడ్ ఫోన్ జాక్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఈ ఫీచర్లను బట్టి చూస్తే... ఈ ఫోన్ ధర రూ.12 వేలలోపే ఉండే అవకాశం ఉంది.


నోకియా జీ20 గతంలో మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.12,999గా ఉంది. ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంది. గ్లేసియర్, నైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.