డిచిన కొద్ది రోజులుగా చైనా కంపెనీలకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు మేలు కలిగేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.  చైనాకు చెందిన షావోమీ, రియల్‌మీ, వివో, ఒప్పోకు చెందిన రూ.12వేల లోపు బడ్జెట్‌ ఫోన్లను నిషేధించబోన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.


చైనా కంపెనీలకు కేంద్రం ఏం చెప్పిందంటే?


ఈ నేపథ్యంలో  చైనా స్మార్ట్‌ ఫోన్‌లను బ్యాన్‌ చేస్తున్నారా? లేదా? అనే అంశంపై కేంద్ర ఐటీ శాఖ స‌హాయ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్‌ ఫోన్‌లను భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతి చేయాలని చైనా ఫోన్‌ల తయారీ సంస్థల్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. అంతేకానీ.. దేశంలో చైనా ఫోన్‌లను బ్యాన్ చేయాలనే ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. “ దేశీయంగా ఉత్పత్తుల్ని పెంచడమే ప్రభుత్వ బాధ్యత, కర్తవ్యం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు.


మొబైల్ మార్కెట్ లో భారత్ రెండో అతిపెద్ద దేశం


వాస్తవానికి ప్రపంచ మొబైల్​ మార్కెట్​లో రెండో అతిపెద్ద దేశంగా భారత్ కొనసాగుతున్నది. అయితే ఇందులో చైనా ఫోన్లే అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోవర్​ సెగ్మెంట్​ నుంచి చైనా ఫోన్లను తప్పించాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు కొన్ని ప్రసార సాధనాల్లో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయంతో షియోమీతో పాటు దానికి పోటీగా ఉన్న సంస్థల ఆదాయంపై దెబ్బ పడుతుందనే చర్చ జరిగింది. ఇండియా సేల్స్​ వాల్యూమ్స్​లో రూ. 12 వేలు అంత కన్నా తక్కువ ధరలు ఉన్న స్మార్ట్ ​ఫోన్లు మూడో వంతు ఉండగా.. 80 శాతం స్మార్ట్ ​ఫోన్లు చైనా కంపెనీలవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాన్ వార్త సర్వత్రా ఆసక్తి కలిగింది.


సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. చైనా కంపెనీలపై కేంద్రం ఇటీవలి కాలంలో గట్టి నిఘా పెట్టిందని.. షియోమి, ఒప్పో, వివో వంటి సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఓ కన్నేసిందని కథనాలు వచ్చాయి. ఈ ఫలితంగానే పలు చైనా కంపెనీలు ఇటీవలి కాలంలో పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్​ ఆరోపణలు ఎదుర్కొన్నాయని వెల్లడించాయి. ఒకవేళ చైనా కంపెనీల ఫోన్లను నిషేధిస్తే  సామ్​సంగ్​ సహా పలు కంపెనీలకు మేలు కలుగుతుందని ప్రకటించాయి. కానీ, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటనతో ఆ వార్తలన్నీ అవాస్తవాలుగా తేలాయి.  


స్వదేశీ కంపెనీలకు లాభం


చైనా ఫోన్లను బ్యాన్ చేస్తే లావా, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ వంటి ఇండియన్ కంపెనీలు ఎక్కువ మేలు కలుగుతుందని ఫోన్ల అమ్మకందారులు అభిప్రాయపడ్డారు. అయితే, తొలి నుంచి చైనీస్ బ్రాండ్లు మంచి ప్రొడక్ట్స్‌ ను అందించడం ద్వారా ఇండియన్ మార్కెట్‌ కు అంతరాయం కలిగించాయన్నారు.  దీంతో  నెమ్మదిగా ఇండియన్ బ్రాండ్లకు ఆదరణ తగ్గిపోయినట్లు వెల్లడించారు.


Also Read: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!