నెట్‌ఫ్లిక్స్ తన గేమింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. "యాడ్స్ లేని, యాప్‌లో కొనుగోలు చేయాల్సిన అవసరం లేని ఒరిజినల్ గేమ్‌లు" రూపొందించడానికి ఫిన్‌లాండ్‌లోని హెల్సింకిలో తన అంతర్గత గేమింగ్ స్టూడియోను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన రాబోయే గేమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి ఎలాంటి వివరాలను వెల్లడించనప్పటికీ, హెల్సింకిలో రాబోయే గేమింగ్ స్టూడియోకి జింగా, గతంలో ఈఏ గేమింగ్ కంపెనీలో పని చేసిన మార్కో లాస్టికా డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని పేర్కొంది. “ప్రపంచంలో అత్యుత్తమ గేమింగ్ టాలెంట్‌కు ఇది సొంతిల్లు కానుంది." అని తెలిపింది.


నెట్‌ఫ్లిక్స్ తన రాబోయే గేమింగ్ స్టూడియోలో అభివృద్ధి చేయాలనుకుంటున్న గేమ్‌ల గురించి ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందర అవుతుందని, కొత్త గేమ్‌ను రూపొందించడానికి  కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని కంపెనీ తెలిపింది. రాబోయే సంవత్సరాల్లో తమ వినియోగదారులను అప్‌డేట్ చేయడాన్ని కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది.


"గేమ్‌ను రూపొందించడానికి సంవత్సరాలు పట్టవచ్చు, కాబట్టి మేం మా మొదటి సంవత్సరంలో మా గేమ్‌ల స్టూడియోల పునాదిని ఎలా స్థిరంగా నిర్మిస్తున్నామో చూసి గర్వపడుతున్నాం. రాబోయే సంవత్సరాల్లో మేం ఉత్పత్తి చేసే వాటి గురించి తెలపడానికి ఎదురుచూస్తున్నాం." అని నెట్‌ఫ్లిక్స్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.


ది వాకింగ్ డెడ్: నో మ్యాన్స్ ల్యాండ్, ది వాకింగ్ డెడ్: అవర్ వరల్డ్ వంటి గేమ్‌లకు ప్రసిద్ధి చెందిన ఫిన్‌లాండ్-బేస్డ్ మొబైల్ గేమింగ్ స్టూడియో  నెక్స్ట్ గేమ్స్‌ను కంపెనీ కొనుగోలు చేసిన నెలల తర్వాత ఈ అభివృద్ధి జరగడం గమనించదగ్గ విషయం. స్ట్రేంజర్ థింగ్స్: పజిల్ టేల్స్ వంటి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రాంచైజీల ఆధారంగా గేమ్‌లను రూపొందించడంలో కూడా కంపెనీ ఎంతో పేరు పొందింది.


కంపెనీ గేమింగ్ స్టూడియోల పోర్ట్‌ఫోలియోలో నెక్స్ట్ గేమ్స్ కూడా చేరింది. ఇందులో నైట్ స్కూల్ స్టూడియో, బాస్ ఫైట్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉన్నాయి. నైట్ స్కూల్ స్టూడియో దాని గేమింగ్ ఆక్సెన్‌ఫ్రీకి ప్రసిద్ధి చెందింది. ఇది నెట్‌ఫ్లిక్స్ ఆండ్రాయిడ్, iOS సబ్‌స్క్రైబర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఆడేందుకు అందుబాటులో ఉంటుంది. దీనిని 2021 సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మరోవైపు బాస్ ఫైట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. 2022 మార్చిలో నెక్స్ట్ గేమ్స్ నెట్‌ఫ్లిక్స్ పోర్ట్‌ఫోలియోలో చేరాయి. ఇది డంజెన్ బాస్, మై వేగాస్ బింగో వంటి ఆటల ద్వారా ఫేమస్ అయింది.


ఈ అక్విజేషన్‌లన్నీ నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ ప్లాన్‌ల గురించి క్లియర్ పిక్చర్‌ను అందిస్తాయి. కంపెనీ కేవలం థర్డ్-పార్టీ కంపెనీల ద్వారా గేమ్‌లను అందించాలని కోరుకోవడం లేదు. నెట్‌ఫ్లిక్స్ ఎక్స్‌క్లూజివ్‌ల ద్వారా సిరీస్, సినిమాలను ఆఫర్ చేసినట్లే, దాని సొంత ప్లాట్‌ఫారమ్‌కు చెందిన కొత్త గేమ్‌లను అందించాలని కూడా ఆలోచిస్తోంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?