MP Vijayasai Reddy : విశాఖ దసపల్లా భూకుంభకోణంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన వార్తలని ఖండిస్తున్నానన్నారు. దశపల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అప్పటి అడ్వకేట్ జనరల్ సూచనతో తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు. రాణి కమలాదేవి ఈ భూమి యజమానురాలుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కొన్ని పత్రికలు, రాజకీయ పార్టీలు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సర్క్యూట్ హౌస్, నావికా దళ కార్యాలయం కూల్చి వేస్తారనేవి అసత్య ప్రచారం అన్నారు. 


500 మందికి ప్రయోజనం 


దసపల్లా భూములను 22ఏ నుంచి తొలగించడం ద్వారా 40 ఎకరాల్లో 500 మందికి ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. 64 మంది ఫ్లాట్ యాజమానుల పరిధిలో ఉన్న 20 శాతం భూమిని మాత్రమే ఎషూర్ డెవలపర్స్ కు అప్పగించారని తెలిపారు. టీడీపీ కార్యాలయం కూడా దసపల్లా భూముల్లోనే ఉందన్నారు.  టీడీపీ నేతలు దసపల్లా భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.  


గతంలో వైసీపీ ఆందోళన 


విశాఖ దసపల్లా భూములపై  రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దసపల్లా భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2009లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఫాలో అవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ గతంలో ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. దీంతో ఈ భూములకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్లాన్ అప్రూవల్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ భూముల వ్యవహారంపై రాణి కమలాదేవి అనే మహిళ గతంలో హైకోర్టు,  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతే కాకుండా ఈ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారoటూ వైసీపీ నేతలు ఆందోళన చేశారు. స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా ఆనాడు విశాఖలో ఆందోళన చేపట్టారు. 


విపక్షాల ఆరోపణలు 


దసపల్లా భూకుంభకోణం రూ.4 వేల కోట్లు ఉంటుందని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నారు.  ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.  దసపల్లా భూములపై సీబీఐ విచారణ జరపాలంటూ సీబీఐ ఎస్పీకి ఫిర్యాదు చేశాయి.  వైసీపీ ప్రభుత్వం అడ్డంగా కోట్ల రూపాయలు దోచేస్తుందని విపక్ష నేతలు మండిపడ్డారు. విశాఖ దసపల్లా భూములపై ఉన్న 22ఏ ఆంక్షలను‌ అకస్మాత్తుగా ఎత్తివేయడంపై జనసేన, టీడీపీ, సీపీఐ ఆగ్రహం చేశాయి.   వైసీపీ కీలక నేత కూతురు, కుమారుడు  రూ.9.75 కోట్లు లావాదేవీలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఉత్తరాంధ్రలో ఏ భూమి కబ్జా జరిగినా క్రిమినల్ కేస్ పెట్టమని అధికారులను ఆదేశించారని, మరి ఇప్పుడు కేసు  పెట్టమంటారా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరగాలని, విశాఖ పరిపాలన రాజధాని పేరు చెప్పి ఇక్కడి భూములను కొట్టేస్తున్నారని మండిపడుతున్నారు.