Asteroid Alert: భూగ్రహానికి ఈ మధ్య గ్రహశకలాల బెడద ఎక్కువ అయింది. బుధవారం భూమికి దగ్గర నుంచి నాలుగు గ్రహశకలాలు దూసుకెళ్లాయి. వీటిలో ఒకటి 140 అడుగుల భారీ గ్రహశకలం. వీటి కారణంగా భూమికి ప్రమాదం కలగనందుకు శాస్త్రవేత్తలు సంతోషించారు. కానీ ఇప్పుడు మరో ముప్పు ముంచుకొచ్చింది. ఏకంగా 420 అడుగుల భారీ గ్రహశకలం గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఈ గ్రహశకలానికి 2024 ఈయూ4 అని పేరు పెట్టారు.


2024 ఈయూ4 అనే గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుంది. దీని వెడల్పు ఏకంగా 420 అడుగులుగా ఉంది. భూమికి దగ్గరగా వచ్చిన బోలెడన్ని గ్రహశకలాల కంటే ఇది చాలా పెద్దది. అలాగే దీని వేగం కూడా చాలా ఎక్కువ. నాసా డేటా ప్రకారం గంటలకు 101,885 కిలోమీటర్ల వేగంతో ఇది భూమి వైపు వస్తుంది.


మార్చి 23వ తేదీ నాటికి 2024 ఈయూ4 భూమికి దగ్గరగా రానుంది. భూమికి 4.5 మిలియన్ మైళ్ల దూరం నుంచి ఈ గ్రహశకలం దూసుకుపోనుందని నాసా లెక్కలు వేసింది. ఇది మనకు చూడటానికి ఎక్కువ దూరంలాగే అనిపించినా ఈ శకలం అంచనా వేసిన దూరం నుంచి కాస్త డీవియేట్ అయి భూమి వైపు వచ్చినా విపత్తులు సంభవించే అవకాశం ఉంటుంది.


ఈ గ్రహశకలం ప్రమాదకరమైనదా?
420 అడుగుల సైజు ఉంది కాబట్టి ‘2024 ఈయూ4’ను నాసా ప్రమాదకరమైన శకలంగానే పరిగణిస్తుంది. భూమికి 4.6 మిలియన్ మైళ్ల దూరంలో దూసుకుపోయే, 150 మీటర్ల కంటే పొడవైన వస్తువులను ప్రమాదకరమైనవిగా పరిగణించవచ్చు. భారీ గ్రహశకలాలు భూమి దగ్గర నుంచి వెళ్లడం వినటానికి కాస్త దడ పుట్టించినా అంత భయపడాల్సిన అవసరం లేదు. నాసా దీన్ని చాలా క్లోజ్‌గా ట్రాక్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ భయపడాల్సి అవసరం ఏమీ లేదు.


గ్రహశకలాలకు పేర్లు ఎలా పెడతారు?
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియర్ (ఐఏయూ) గ్రహశకలాలకు పేర్లు సూచిస్తుంది. వరుసగా రెండు రాత్రులు ఎవరైనా అబ్జర్వర్ దీన్ని గుర్తిస్తే పేర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వీటిని మొదట గుర్తించిన అబ్జర్వర్ ఈ డేటాను ఐఏయూకు పంపుతారు. ఐఏయూ గ్రహశకలాలకు పేర్లు పెడుతుంది.


ఈ పేరు గ్రహశకలాన్ని కనిపెట్టిన సంవత్సరంతో ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కనుగొంటే AA, AB, AC ఇలా పెడతారు. అదే జనవరి 16వ తేదీ నుంచి 31వ తేదీ లోపు కనుగొంటే BA, BB, BC ఇలా పేర్లు పెడతారు. ఇలా సంవత్సరం ముగిసేవరకు కొనసాగుతుంది.


ఇటీవలే మార్చి 16వ తేదీన ఒక ఒక భారీ గ్రహశకలం భూమికి సమీపం నుంచి వెళ్లింది. కుతుబ్‌మినార్‌కు డబుల్ సైజులో ఉన్న ఈ గ్రహశకలం సైజు 61 మీటర్ల నుంచి 140 మీటర్ల మధ్య ఉండవచ్చని నాసా అంచనా వేసింది. ఈ గ్రహశకలానికి 2024 సీజే8 అని పేరు పెట్టారు. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (సీఎన్ఈవోఎస్) డేటా ప్రకారం ఈ గ్రహశకలం భూమికి 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకువెళ్లింది. దీని వేగం గంటకు 43 వేల కిలోమీటర్లుగా ఉందని నాసా తెలిపింది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?