Congress Bank Accounts Freezing: కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బ తీయాలని ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని సోనియా గాంధీ ఆరోపించారు. ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా తమ బ్యాంక్ ఖాతాలని ఫ్రీజ్ చేశారని మండి పడ్డారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బుల్ని వాడుకోకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బలవంతంగా తమ నుంచి ఈ నిధుల్ని లాగేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ బాండ్స్ కేసునీ ప్రస్తావించారు సోనియా. ఇది రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిన సంగతి గుర్తు చేశారు. ఈ బాండ్స్‌తో బీజేపీయే ఎక్కువగా లబ్ధి పొందిందని వెల్లడించారు.
"ఇది కేవలం కాంగ్రెస్ సమస్య మాత్రమే కాదు. బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యానికే సమస్య వచ్చి పడింది. కాంగ్రెస్‌ని పూర్తిగా ఆర్థికంగా దెబ్బ తీయాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారు. ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన డబ్బుల్ని వాడుకోకుండా ఎక్కడికక్కడ అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేశారు. బలవంతంగా డబ్బులు లాగేసుకుంటున్నారు. అయినా సరే ఎలాగోలా ప్రచారం చేస్తున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వీటి వల్ల బీజేపీ మాత్రమే లాభ పడింది. కాంగ్రెస్‌పై ఆ పార్టీ చేస్తున్న దాడి అప్రజాస్వామికం"
- సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
అటు రాహుల్ గాంధీ కూడా బీజేపీపై తీవ్రంగా మండి పడ్డారు. అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయడం వల్ల ప్రచారం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వెల్లడించారు. కార్యకర్తలకు సహకరించాలనుకున్నా ఆ అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం దీనిపై స్పందించడం లేదని, ఇప్పటికే నెల రోజులు గడిచిపోయాయని ఫైర్ అయ్యారు రాహుల్. ఇది ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అవమానంగా భావిస్తున్నట్టు చెప్పారు. రైల్ టికెట్స్ కొనడానికీ డబ్బుల్లేని స్థితిలో ఉన్నట్టు వెల్లడించారు.
"కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్‌లనే కాదు. ప్రజాస్వామ్యాన్నీ బీజేపీ కట్టడి చేసేసింది. ఇంత పెద్ద ప్రతిపక్ష పార్టీ అయ్యుండి కూడా మేం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. యాడ్స్ చేయించుకోలేకపోతున్నాం. నేతల్ని వేరే చోటుకి పంపించలేకపోతున్నాం"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత