ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా తమ కస్టమర్ల సంఖ్య పెంచేందుకు, వారిని ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తూ వస్తోంది. అలా తాజాగా ఇప్పుడు మరో సరికొత్త ఫోన్‌ను తీసుకువస్తోంది. రీసెంట్‌గానే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరోలా రేజర్ 50 సిరీస్ తీసుకొచ్చిన సదరు కంపెనీ ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్ 50 నియోను తీసుకురానుంది. గతేడాది తీసుకొచ్చిన ఏడ్జ్ 40 నియోకు లేటెస్ట్ మోడల్‌గా దీన్ని తీసుకురానుంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ ఈ కొత్త మోడల్ డిజైన్, ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెసిఫికేషన్స్
డిస్ప్లే - 91 మొబైల్స్ రిపోర్ట్ ప్రకారం.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 ఇంచ్ పీఓపీఎల్ఈడీ డిస్ప్లే ఈ ఫోన్‌కు ఉంది. ఇది స్మూత్ స్క్రోలింగ్‌తో పాటు మంచి వ్యూయింగ్ అనుభవాన్ని అందించనుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, మాల్- G615 GPUతో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ఇదే ప్రొసేసర్ గత నెలలో విడుదలైన సీఎమ్ఎఫ్ ఫోన్ 1కు కూడా ఉంది.
కెమెరా, బ్యాటరీ
ఈ ఎడ్జ్ 50 నియోకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మె గాపిక్సెల్, 10 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్లు, అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో నడుస్తుంది.
డిజైన్ అండ్ బిల్డ్
ఈ స్మార్ట్ ఫోన్‌కు 8GB ర్యామ్, 256 GB స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంది. అలానే లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత హెలో యూఐ మీద ఇది నడుస్తుంది. వాటర్-డస్ట్ రెసిస్టెన్స్‌తో రానున్న ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. 8.1 ఎంఎం మందం, 171 గ్రాముల బరువుతో రానున్న ఈ ఫోన్ సొగసైన, తేలికపాటి డిజైన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. నాలుగు రకాల రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
ధర ఎంతంటే?
మొత్తంగా అదిరే స్టైలిష్, రిచ్ ఫీచర్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన పనితీరుతో ఉంటుందని అంటున్నారు. అయితే దీని ధర, లభ్యత వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ, త్వరలో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక గతేడాది విడుదలైన ఎడ్జ్ 40 నియో 8GB RAM/128GB స్టోరేజ్ రూ.22,999 ధరకు లభించగా, 12GB ర్యామ్ వేరియంట్ రూ.24,999కు అందుబాటులో ఉంది. ఇంచుమించు ఎడ్జ్ 50 నియో ధర కూడా ఇంతే ఉండనున్నట్లు సమాచారం.