New Feature in YouTube: ఖాళీగా ఉన్న టైంలో కానీ లేదా జర్నీ టైంలో ఇంట్లో ఏదైనా సమయంలో యూట్యూబ్‌లో కానీ లేదా, వేరే యాప్స్ ద్వారా పాటలు వినడం సర్వసాధారణం. నచ్చిన పాటలను టైప్ చేసి వాటిని వింటూ ఉంటాం.  కొన్ని సార్లు పాటలు గుర్తు ఉంటాయి కానీ సినమా పేరు కానీ, పాటలోని లిరిక్స్ కానీ మర్చిపోతుంటాం. ఆ పాట  మనసులో  తిరుగుతూ ఉంటుంది, కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా లిరిక్స్ గుర్తుకు రావు. ఆ పాట చెవిలో మోగుతుంటుంది కానీ ఎలా టైప్ చేయాలో అర్థం కాదు. ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించింది యూట్యూబ్. ఇలాంటి సమయంలో మీకు గుర్తు ఉన్న పాటను హమ్ చేస్తే చాలు ఆ సాంగ్‌ను గుర్తు పట్టి మీకు చెప్పేస్తోంది. మీరు ఎలా హమ్ చేసినా ఆ పాట ఏంటో YouTube గుర్తుపడుతుంది.  

అవును, YouTube ఒక కొత్త అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు కేవలం హమ్ చేసుకునే పాట లేదా ఈల ద్వారా పాడిన మీకు నచ్చిన పాటను వెతకవచ్చు. ఇప్పుడు Shazam లేదా ఏ ఇతర యాప్ అవసరం లేదు, నేరుగా YouTubeలోకి వెళ్లి పాటను గుర్తించి వినండి.

ఈ ఫీచర్ Googleలోని Hum to Search ఫీచర్ లాగే పని చేస్తుంది. మీరు నచ్చిన పాటను లిరిక్స్ ఇవ్వకుండా హమ్ చేయండి చాలు ఆ పాట ఏమిటో చెబుతుంది.

ఎలా ఉపయోగించాలి? 

  • ముందు YouTube యాప్ ఓపెన్ట చేయండి
  • పైన కుడివైపున ఉన్న సెర్చ్ ఆప్షన్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి
  • ఇప్పుడు ఆ సెర్చ్ బార్ వద్ద ఒక మైక్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయండి
  • అది యాక్టివేట్ అయిన తర్వాత మీరు పాట పాడవచ్చు, లేదా హమ్ చేయవచ్చు. లేదా విజిల్ వేసి కూడా పాట తెలియజేవచ్చు.  
  • YouTube మీ స్వరాన్ని గుర్తిస్తుంది. మీకు పాటల జాబితాను చూపుతుంది

మీకు కావలసిన పాట దొరికితే, దానిపై క్లిక్ చేసి వినడం ప్రారంభించండి. దొరకకపోతే, మళ్ళీ ప్రయత్నించండి.

ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, ఈ ఫీచర్ కోసం YouTubeకి మైక్రోఫోన్ అనుమతి ఇవ్వాలి. మీరు కోరుకుంటే, యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే అనుమతి ఇవ్వండి. తరువాత దాన్ని ఆపవచ్చు.

అందరికీ ఇంకా ఈ ఫీచర్ అందుబాటులో లేదు

ప్రస్తుతం ఈ సౌకర్యం కొంతమంది ఎంచుకున్న Android వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, ముఖ్యంగా YouTube బీటా వెర్షన్‌ను ఉపయోగిస్తున్న వారికి. అంటే iPhone వినియోగదారులు లేదా మిగిలిన Android వినియోగదారులు కొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది.

కానీ ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు, పాటను గుర్తించే విధానం మారిపోతుంది. ఇక పదాలు గుర్తుంచుకోవడం లేదా వేరే యాప్ ఓపెన్ చేసి పాటల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం హమ్ చేయడం ద్వారా పాటల గురంచి YouTube ను అడగండి