Whatsapp Latest News Today: నిరంతరం ప్రజలతో మమేకమై పోయిన యాప్ ఏదైనా ఉంటే అది వాట్సాపే. సమాచార సాంకేతిక విప్లవంలో ఇప్పుడు వాట్సాప్ పాత్ర అగ్రస్థానంలో ఉంది. సమాచారమైనా, ఫొటోలైనా.. నివేదికలైనా.. చివరకు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్లయినా.. ఇలా దేనికైనా ఇచ్చిపుచ్చుకోవడానికి, పంపించుకోవడానికి కూడా.. వాట్సాప్ కేరాఫ్. తెల్లతెల్లవారుతూనే.. వాట్సాప్.. నిద్రకు ఉపక్రమిస్తూ కూడా వాట్సాప్.. ఇదీ నేటి ప్రజల అలవాట్లు. వాట్సాప్ ఒక్క పది నిమిషాలు అంతరాయం వస్తేనే తట్టుకోలేనంతగా ఆ వ్యవస్థతో ప్రజలు ముడిపడిపోయారు. అలాంటిది ఇప్పుడు వాట్సాప్ సంస్థ.. సంచలన ప్రకటన చేసింది. 2025 మే నుంచి పాత ఐఫోన్ల మోడళ్లకు( iOS వెర్షన్లు) సపోర్టు చేయడం లేదని స్పష్టం చేసింది. వీటిలో iPhone 5s, iPhone 6, iPhone 6 + ఉండడం గమనార్హం.
WABetaInfo నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. వాట్సాప్ ఇకపై 15.1 కంటే ముందు ఉన్న iOS వెర్షన్‌లను సపోర్టు చేయదు. దీంతో పాత iPhoneల కోసం అందుబాటులో ఉన్న చివరి సాఫ్ట్‌వేర్ వెర్షన్ iOS 12.5.7 కంటే అప్‌డేట్ చేయలేని పరికరాలను ప్రభావితం చేస్తుంది. ఈ మోడల్‌లలోని వినియోగదారులు తప్పనిసరిగా కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. లేదా ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన గడువు తర్వాత ప్రస్తుత హార్డ్‌వేర్ ఇకపై WhatsAppకి సపోర్టు చేయదన్నమాట.
ఐదు మాసాలకు ముందే..
వాట్సాప్ తన వినియోగదారులకు ఐదు మాసాల ముందుగానే ఈ సమాచారానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. 2025, మే నుంచి మార్పులు వస్తాయని తెలిపింది. ఈ లోగా iPhone 5s, iPhone 6, iPhone 6 + వినియోగదారులు తమ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే.. కొత్త ఐఫోన్ మోడళ్లను వినియోగించే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రకటనలో పేర్కొన్నారు. iOS 15.1 లేదా తదుపరి జనరేషన్‌కు ఎలాంటి ప్రభావం ఉండదని, అంతరాయం లేకుండా యాప్‌ని కొనసాగించవచ్చునని తెలిపింది. సెట్టింగ్‌లు > జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు నావిగేట్ చేయడం ద్వారా వినియోగదారులు తమ ఐఫోన్‌లు తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను అమలు చేస్తున్నాయని నిర్ధారించుకోవచ్చు.
తీవ్ర ప్రభావం
తాజాగా వాట్సాప్ తీసుకున్న నిర్ణయం ఐఫోన్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులపై ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తున్నవారు.. యథావిధిగా వాట్సాప్‌ను కొనసాగించవచ్చు. ఈ అప్‌డేట్ ఇటీవలి iOS వెర్షన్‌లలో అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీ, APIలను ఉపయోగించుకోవడానికి WhatsApp చేస్తున్న ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్ ని కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడానికి, భద్రతను మెరుగుపరచడానికి, మొత్తం పనితీరును మెరుగుపరచడానికి-పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు సమర్థవంతంగా సపోర్ట్ చేయలేని సామర్థ్యాలను ఎనేబుల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ iPhone 5s, iPhone 6 లేదా iPhone 6+ వినియోగిస్తున్న వినియోగదారులు.. WhatsApp కోసం కొత్త వెర్షన్ వైపు అడుగులు వేయక తప్పదన్న మాట. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది.
Also Read: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024