రియల్‌మీ 10 4జీ స్మార్ట్ ఫోన్ గతవారం మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు ఇందులో 5జీ వెర్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది సైలెంట్‌గా చైనాలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్‌ప్లే కూడా ఉంది. రూ.15 వేలలోపు మార్కెట్లో ఉన్న రెడ్‌మీ, షావోమీ, శాంసంగ్ 5జీ ఫోన్లకు ఇది గట్టి కాంపిటీషన్ ఇవ్వనుంది.


రియల్‌మీ 10 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.14,700) ఉండగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా (సుమారు రూ.18,100) నిర్ణయించారు.


రియల్‌మీ 10 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.6 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2400 పిక్సెల్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.


రియల్‌మీ 9ఐ 5జీ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందుబాటులో ఉంది.


6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W క్విక్ చార్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?