Gpay trending on twitter: డిజిటల్‌ చెల్లింపులు, యూపీఏ పేమెంట్స్‌ చేయడంలో భారత్‌కు తిరుగులేదు. 2016 నుంచి అత్యధిక వృద్ధిరేటుతో ఈ రంగం దూసుకుపోతోంది. ప్రతి నెలా కోట్ల సంఖ్యలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో గూగుల్‌ పేకు గణనీయమైన వాటా ఉంది. ఫోన్‌పే తర్వాత ఎక్కువ జీపేనే వినియోగదారులు ఉపయోగిస్తుంటారు. ఎక్కువ రివార్డులు ఇవ్వడమే ఇందుకు కారణం.




మొదట తేజ్‌ యాప్‌ పేరుతో గూగుల్‌ ఈ యాప్‌ను ప్రచారం చేసింది. భారీ స్థాయిలో కస్టమర్లకు రివార్డులు ఇచ్చేది. మొదట్లో పది లావాదేవీల్లో కనీసం ఐదింటికి ఒక రూపాయి నుంచి రూ.15 వరకు అందించేది. కొందరికి రూ.800 వరకు వచ్చేవి. వీక్లీ రివార్డుల్లో లక్ష రూపాయల లోపు నగదు పొందినవారూ ఉన్నారు.




కస్టమర్లు పెరిగాక జీపే రివార్డులు ఇవ్వడం మానేసింది. కనీసం ఐదు రూపాయలైనా ఇవ్వడం లేదు. కొన్నాళ్లు రివార్డుల ట్రెండ్‌ను మార్చేసింది. మర్చంట్స్‌తో కలిపి విచిత్రమైన ఆఫర్లు ఇస్తోంది. డీమ్యాట్‌ అకౌంట్‌ తీసుకోవాలనో, ఏవైనా బ్యూటీ ప్రొడక్ట్స్‌పై రూ.1500 బిల్‌ చేస్తేనో, కళ్లద్దాలు తీసుకోవడానికే కూపన్‌ కోడ్స్‌ ఇవ్వడం మొదలు పెట్టింది.




సాధారణంగా మధ్యతరగతి వారికి అవసరమయ్యే ఆఫర్లను గూగుల్‌ పే ఇవ్వడం లేదు. కూపన్‌ను స్క్రాచ్‌ చేస్తే బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్‌ కనిపిస్తోంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్లు గూగుల్‌ పేపై మీమ్స్‌ పంచుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో #Gpay హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.