పోకో ఎం5 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6 జీబీ వరకు ర్యామ్ ఉంది. వెనకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.
పోకో ఎం5 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు.
సెప్టెంబర్ 13వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభించనుంది. అంటే దీని ధర రూ.11 వేల నుంచే ప్రారంభం కానుందన్న మాట. దీంతోపాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ వార్షిక సబ్‌స్క్రిప్షన్, ఉచిత స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా అందించనున్నారు. ఎంతో పోటీ ఉన్న రూ.15 వేలలోపు విభాగంలో ఈ ఫోన్ లాంచ్ అయింది. రియల్‌మీ, రెడ్‌మీ, ఇన్‌ఫీనిక్స్, టెక్నో బ్రాండ్లకు చెందిన మొబైల్స్‌తో ఈ ఫోన్ పోటీ పడనుంది.
పోకో ఎం5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 30 హెర్ట్జ్ నుంచి 90 హెర్ట్జ్ మధ్యలో రిఫ్రెష్ రేట్ మారుతూ ఉంటుంది. టచ్ శాంప్లింగ్ రేట్ ఏకంగా 240 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ 6 ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, జీపీఎస్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా పోకో ఎం5లో ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే రెండు రోజుల బ్యాకప్‌ను ఈ ఫోన్ అందించనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!