వన్‌ప్లస్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ వన్‌ప్లస్ వీ ఫోల్డ్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ షీట్‌ను షేర్ చేశారు. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో (జులై నుంచి సెప్టెంబర్ మధ్య) తన ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేస్తుందని బ్రాండ్ ఇప్పటికే ధృవీకరించింది. ఈ ఫోన్ ఆగస్ట్‌లో లాంచ్ అవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి.


పెద్ద డిస్‌ప్లేతో..
లీకుల ప్రకారం వన్‌ప్లస్ వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ బయటవైపు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.3 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. లోపలి వైపు 7.8 అంగుళాల అమోఎల్ఈడీ ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 120 హెర్ట్జ్‌నే. లీక్ అయిన రెండర్ల ప్రకారం స్క్రీన్ చుట్టూ సన్నని బెజెల్స్‌ను చూడవచ్చు.


వన్‌ప్లస్ వీ ఫోల్డ్ కెమెరా
వన్‌ప్లస్ వీ ఫోల్డ్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం  48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో యూనిట్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన ఆప్టికల్ జూమ్ వివరాలు తెలియరాలేదు. సెల్ఫీల కోసం, ప్రధాన డిస్‌ప్లే వైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు 20 మెగాపిక్సెల్ అండర్ స్క్రీన్ కెమెరాను కూడా అందించారు.


మెమరీ, ప్రాసెసర్ వివరాలు
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఇది 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంటుందని వార్తలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ పరంగా చూసుకుంటే వన్‌ప్లస్ వీ ఫోల్డ్‌లో ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టం ఉండనుంది.


మరోవైపు వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 2కి ఇది ప్రో వెర్షన్‌గా రానుంది. వన్‌ప్లస్ ఏస్ 2లో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే కంపెనీ అందించింది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 5జీ ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ ఏస్ 2 పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు లాంచ్ కానున్న వన్‌ప్లస్ ఏస్ 2 ప్రోలో మాత్రం అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లు ఉండనున్నాయి.


ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ ఛాట్ స్టేషన్ వీబో పోస్ట్ ప్రకారం వన్‌ప్లస్ 2 ప్రోలో ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్ అందించనున్నారు. వన్‌ప్లస్ ఏస్ 2లో అందించిన ప్రాసెసర్ కంటే ఇది వేగవంతమైన ప్రాసెసర్. 


ఇంతకుముందు అమెజాన్ అనుకోకుండా ఐకూ నియో 7 ప్రో 5జీ ధరను కూడా లీక్ చేసింది. మోటొరోలా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మోటొరోలా రేజర్ 40,  మోటొరోలా రేజర్ 40 అల్ట్రాలను జూలై 3వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే అధికారిక లాంచ్‌కు ఒక వారం ముందు మోటొరోలా రేజర్ 40 ధర అనుకోకుండా అమెజాన్‌లో లీక్ అయింది.




Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!