OnePlus Nord 3 Launched in India: వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో బుధవారం లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. కంపెనీ హైఎండ్ ఫోన్లలో అందించే అలెర్ట్ స్లైడర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ 3 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.33,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.37,999గా నిర్ణయించారు. మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేసింది. జులై 15వ తేదీ నుంచి అమెజాన్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది.


వన్‌ప్లస్ నార్డ్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను వన్‌ప్లస్ నార్డ్ 3లో అందించారు. 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఇందులో ఉంది. 6.74 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. హెచ్‌డీఆర్10+ను వన్‌ప్లస్ నార్డ్ 3 సపోర్ట్ చేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్‌డీఆర్ కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్‌ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను అందించారు. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్‌ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగా పని చేయనుంది. 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.