మోటో జీ52 స్మార్ట్ ఫోన్ మనదేశంలో సోమవారం లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన మోటో జీ51 5జీ స్మార్ట్ ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 90 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ సౌండ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉన్నాయి. రెడ్‌మీ 10 పవర్, ఒప్పో కే10, రియల్‌మీ 9ఐలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.


మోటో జీ52 ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,499 నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499గా ఉండనుంది. ఇవి ప్రారంభ ధరలు మాత్రమేనని కంపెనీ చెప్పింది. భవిష్యత్తులో వీటి ధర పెరిగే అవకాశం ఉంది. చార్‌కోల్ గ్రే, పోర్‌సెలైన్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జియో వినియోగదారులకు రూ.2,549 విలువైన లాభాలు లభించనున్నాయి. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఈ ఫోన్‌పై ఉన్నాయి. మే 3వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది.


మోటో జీ52 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను మోటో జీ52లో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా... స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉండనుంది.


6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్పీలు, వీడియోకాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా... బరువు 169 గ్రాములుగా ఉంది.


Also Read: OnePlus 10: వన్‌ప్లస్ 10 ఫీచర్లు లీక్ - లాంచ్ ఎప్పుడంటే?


Also Read: Realme GT 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.ఐదు వేల వరకు ఆఫర్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?