Recharge Bills Will Increase From Today : మొబైల్ వినియోగదారులకు ఇకపై రీఛార్జ్ బిల్లుల మోత మోగనున్నాయి. ఈ నెల మూడో తేదీ నుంచి సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ సిమ్ రీఛార్జ్ బిల్లులను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. ప్రతి ఇంట్లోనూ కనీసం రెండు నుంచి ఐదు వరకు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి నెల రీఛార్జ్ కోసం కనీసం వంద నుంచి 300 వరకు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రీఛార్జిల టారిఫ్ మొత్తాన్ని పెంచుతూ సర్వీస్ ప్రొవైడర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇది మొబైల్ వినియోగదారులపై భారానికి కారణం కానుంది ప్రతి ప్లాన్ మీద కనిష్టంగా రూ.35 నుంచి గరిష్టంగా రూ.100 వరకు పెరిగాయి. దీంతో స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్, కీప్యాడ్ మొబైల్ ఫోన్లు వినియోగదారులందరూ పెంచిన చార్జీల పరిధిలోకి రానున్నారు. తాజాగా పెరిగిన చార్జీల ప్రకారం నేలకు సగటున కనీసం రూ.30 నుంచి వంద రూపాయలు అదనపు భారం పడనుంది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు ప్రతినెల రీఛార్జ్ కోసం రూ.200 చొప్పున వెచ్చిస్తున్నారు. ఇది ఇకపై ఈ మొత్తానికి రూ.50 వరకు అదనంగా పెరగనుంది. 


వినియోగదారులపై ఆర్థికంగా భారం 


సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ సిమ్ రీఛార్జ్ బిల్లులను పెంచడం వలన ప్రతి వినియోగదారుడుపైనా ఆర్థికంగా భారం పడనుంది. పెంచిన చార్జీల ప్రకారం ఆయా టారీఫ్ లను పరిశీలిస్తే.. 2జీబీ సామర్థ్యంతో 28 రోజులు వ్యాలిడిటీ వచ్చే ప్యాక్ ఇప్పటి వరకు ధర రూ.155 ఉండగా ఇకపై రూ.189 కానుంది. రోజుకు వన్ జీబీ సామర్థ్యం కలిగిన ప్లాన్ 28 రోజులకు ప్రస్తుతం రూ.209 వసూలు చేస్తుండగా, ఇకపై వినియోగదారులు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రోజుకు 1.5 జీబి సామర్థ్యం కలిగిన ప్లాన్ 28 రోజులకు ప్రస్తుతం రూ.239 కాగా, ఇకపై రూ.299 వసూలు చేయనున్నారు. రోజుకు 2జీబీ సామర్థ్యంతో 28 రోజుల ప్లాన్ ప్రస్తుతం రూ.299 కాగా, ఇకపై రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. 2.5 జీబీ సామర్థ్యంతో 28 రోజులకు ప్రస్తుతం రూ.349 వసూలు చేస్తుండగా, పెరిగిన చార్జీలు ప్రకారం ఇకపై రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 3 జీబీ సామర్థ్యంతో 28 రోజులకు ప్రస్తుతం రూ.399 చెల్లిస్తూ ఉండగా, పెరిగిన చార్జీల ప్రకారం రూ.449 చెల్లించనున్నారు.


రోజుకు 1.5 జీబీ సామర్థ్యంతో 50 రోజుల వ్యాలిడిటీతో ప్రస్తుతం రూ.479 వసూలు చేస్తుండగా, పెరిగిన చార్జీల ప్రకారం ఇకపై రూ.579 వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 2జీబి సామర్థ్యంతో 50 రోజుల వాలిడిటీతో కూడిన ప్యాకేజీకి ప్రస్తుతం రూ.533 చెల్లిస్తూ ఉండగా, ఇకపై రూ.629 చెల్లించాల్సి ఉంటుంది. 6 జిబి సామర్థ్యంతో 84 రోజులు వ్యాలిడిటీతో కూడిన ప్యాకేజీకి ప్రస్తుతం రూ.395 చెల్లిస్తుండగా, ఇకపై రూ.497 చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 1.5 జిబి సామర్థ్యంతో 84 రోజులు వాలిడిటీ కలిగిన ప్యాకేజీకి ప్రస్తుతం రూ.666 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.799 చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 2జీబీ సామర్థ్యం కలిగిన 84 రోజులు వ్యాలిడిటీ కలిగిన ప్యాక్ ప్రస్తుతం రూ.719 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.859  చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 3జీబీ సామర్థ్యంతో 84 రోజులు వాలిడిటీ కలిగిన ప్యాక్ కు ప్రస్తుతం రూ.999 చెల్లిస్తుండగా, ఇకపై రూ.1119 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 24 జిబి సామర్థ్యంతో 336 రోజులు వాలిడిటీ కలిగిన ప్యాక్ కు ప్రస్తుతం రూ.1559 చెల్లించాల్సి ఉండగా, ఇకపై రూ.1899 చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 2.5 జిబి చొప్పున రూ.365 రోజులు వాలిడిటీతో కూడిన ప్యాక్ కు ప్రస్తుతం రూ.2,999 చెల్లిస్తూ ఉండగా, ఇకపై రూ.3,599 చెల్లించాల్సి ఉంటుంది. భారీగా పెరిగిన రీఛార్జ్ బిల్లులతో వినియోగదారులపై ఆర్థికంగా పెను భారం పడనుంది.