యాపిల్ భవిష్యత్తులో లాంచ్ చేయనున్న ఐఫోన్లలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లాంచ్ చేసిన ఐఫోన్లలో లైట్‌నింగ్ పోర్టును అందించారు. ఇప్పుడు దాని స్థానంలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టు రానుంది. అయితే ఈ మార్పు 2022 ఫోన్లలో కాకుండా 2023లో లాంచ్ కానున్న ఐఫోన్లలో రానుందని సమాచారం.


ప్రస్తుతం యాపిల్ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్లలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు. లైట్‌నింగ్ కనెక్టర్‌తో పనిచేసే ఇప్పటితరం ఐఫోన్లకు కూడా ఉపయోగపడే అడాప్టర్‌ను రూపొందించడంలో యాపిల్ బిజీగా ఉందని తెలుస్తోంది.


బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం... యాపిల్ చార్జింగ్ పోర్టు మాత్రమే కాకుండా  కొత్త ఐఫోన్లు, టైప్-సీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే అడాప్టర్లను కూడా పరీక్షిస్తుంది. ఈ సంవత్సరం లాంచ్ కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు లైట్‌నింగ్ కనెక్టర్‌తో లాంచ్ కానున్నాయి. కాబట్టి 2023లో లాంచ్ కానున్న ఐఫోన్లలో ఈ మార్పులు చూడవచ్చు.


ప్రస్తుతం యాపిల్ ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీల్లో యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. ఎయిర్‌పోడ్స్, యాపిల్ టీవీ రిమోట్‌ల్లో లైట్‌నింగ్ కనెక్టర్‌నే అందించారు. అన్ని స్మార్ట్ ఫోన్లకు ఒకే తరహా యూనివర్సల్ చార్జర్ ఉండాలని యూరోపియన్ యూనియన్ తెస్తున్న ఒత్తిడి కారణంగానే యాపిల్ ఈ మార్పు చేయడానికి ప్రయత్నిస్తుంది. అన్ని స్మార్ట్ ఫోన్లకు ఒకే తరహా స్టాండర్డ్ కేబుల్ ఉంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గుతుందని యూరోపియన్ యూనియన్ నమ్ముతోంది.


యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో తెలుపుతున్న దాని ప్రకారం... 2023 ద్వితీయార్థం నుంచి యాపిల్ తన ఫోన్లలో లైట్‌నింగ్ పోర్టు బదులు యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించనుంది. దీన్ని బట్టి ఐఫోన్ 15 మోడల్స్‌ యూఎస్‌బీ టైప్-సీ పోర్టుతో లాంచ్ కానున్నాయి.


2012లో లాంచ్ అయిన ఐఫోన్‌తో యాపిల్ మొదటిసారి లైట్‌నింగ్ పోర్టును తీసుకువచ్చింది. 2016లో లాంచ్ అయిన మ్యాక్‌బుక్ ప్రోలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును మొదటిసారి అందించారు. ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 14 మోడల్స్‌పై కూడా పని చేస్తుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 మ్యాక్స్ ప్రో స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!