ఇప్పుడు ఎలాంటి సమాచారాన్ని అయినా ఫోన్‌లో దాచుకుంటున్నారు చాలా మంది. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్స్ అన్నింటినీ ఫోన్‌లో స్టోర్ చేస్తున్నారు.


ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక్కసారి ఫోన్‌ హ్యాక్‌  అయితే మాత్రం అసలుకే ముప్పు వస్తుంది. మీ వ్యక్తిగత సమాచారం అంతా బహిరంగమైపోతుంది. అందుకే ఫోన్‌లో సమాచారం ఎంత భద్రంగా ఉంటే అంత మంచిది. దీనికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. 


ఇప్పుడు చెప్పే మూడు సలహాలు పాటిస్తే చాలు మీ ఫోన్ ఎప్పటికీ హ్యాక్‌ అయ్యే ఛాన్స్ లేదు. ఎవరూ మీ ఫోన్‌ను టచ్‌ చేయలేరు. 


సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్


గాడ్జెట్స్‌ వాడేవాళ్లు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. ఫోన్‌లో అయితే ఇది మరీ ముఖ్యమైనది. సెల్‌ఫోన్‌ సంస్థలు ఎప్పటికప్పుడు బగ్స్‌ క్లియర్ చేస్తూ లోపాలు సరిచేస్తూ ఫోన్‌కు అప్‌డేట్స్ పంపిస్తుంటాయి. వాటికి అనుగుణంగా ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉన్న ఫీచర్స్‌ అప్‌డేట్ అవుతాయి. ఫోన్‌ పనితీరు మెరుగుపడుతుంది. సెక్యూరిటీ సిస్టమ్‌ కూడా అప్‌గ్రేడ్ అవుతూ ఉంటుంది. దీని వల్ల వేరేవాళ్లు, గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్‌ను హ్యాక్ చేసే అవకాశమే ఉండదు. 


సెక్యూర్ యాప్స్ 


ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లో వేల యాప్స్‌ కనిపిస్తుంటాయి. వాటికి రేటింగ్స్‌ కూడా బాగానే ఉంటాయి. రివ్యూలు కూడా అద్భుతంగా ఉంటాయి. అందులో చాలా వాటితో ప్రమాదం పొంచి ఉంటుంది. అందులో మంచి యాప్స్‌ ఎంచుకోవడం పెద్ద టాస్క్‌. భద్రతను దృష్టిలో ఉంచుకుని సురక్షిత యాప్‌లను ఉపయోగించాలి. ఎన్‌క్రిప్షన్ చేసిన యాప్‌లు ఎప్పటికీ సురక్షితం. ఎన్‌క్రిప్షన్ మీ డేటాను సురక్షితంగా ఉంచుతుంది, మీ ఫోన్‌ను గానీ, ఛాట్‌ను ఎవరూ యాక్సెస్ చేయలేరు. WhatsApp లాంటి యాప్స్‌ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ కలిగి ఉన్నాయి. 


అనుమతి విషయంలో జాగ్రత్త


ఇప్పుడు కొన్ని యాప్స్‌ ఇన్‌స్టాల్ చేసుకుంటే లొకేషన్ లాంటి చాలా అంశాలు అడుగుతోంది. మనకు తెలియకుండానే చాలావాటికి ఓకే క్లిక్ చేస్తూ వెళ్లిపోతాం. క్రమంగా అలాంటివే ప్రమాదాలు తెచ్చిపెడతాయి. అందుకే అలా అడిగే యాప్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత అలాంటి సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడమే బెటర్. ఇలా ఇస్తూ వెళ్తే వ్యక్తిగత సమాచారం వాళ్లకు చేరుతుంది. 


ఇలాంటి యాప్స్‌ వల్ల ఫోన్ స్టోరేజ్ కూడా వృథా అవుతుంది. అలాంటి యాప్స్ ఉంటే డిలీట్ చేయడం బెటర్. 


పై మూడు సూచనలు పాటించినట్టైతే మూ ఫోన్‌కు ఎలాంటి ముప్పు ఉండదు. మీ ఫోన్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరు. 


Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌లకు టాటా పోటీ - నియూ యాప్‌తో వచ్చేస్తుంది - ప్రత్యేకతలు ఇవే!