ఎలాన్‌ మస్క్‌ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని  మెటా సంస్థ కొత్త యాప్ ను తీసుకొచ్చింది.  ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో రూపొందిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇండియా సహా పలు దేశాల్లో ఈ కొత్త యాప్ వినియోగంలోకి వచ్చింది. ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో అకౌంట్స్ ఓపెన్ చేశారు.  ఆ తర్వాత మరో రెండు  గంటల్లో 30 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేయడంతో మొత్తం సంఖ్య 50 లక్షలు దాటగా,  7 గంటల్లో  10 మిలియన్ల అకౌంట్స్ ఓపెన్ అయినట్లు మెటా సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు.

  ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌ తో పాటు గూగుల్ ప్లే స్టోర్ లోనూ ‘థ్రెడ్స్’ పేరుతో యాప్ అందుబాటులో ఉంది.



‘థ్రెడ్స్’ డౌన్‌లోడ్ ఎలా చేయాలి? ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి?  


మెటా ‘థ్రెడ్స్’ ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు Google Play లేదంటే Apple App Store నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లాగిన్ చేయడానికి Instagram IDని ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటికే Instagramకి లాగిన్ చేసి ఉంటే, Threads అనుమతి మాత్రమే అడుగుతుంది. అంటే మీరు మళ్లీ లాగిన్ వివరాలను జోడించాల్సిన అవసరం ఉండదు .


‘థ్రెడ్స్’ ఎలా ఉపయోగించాలి?


మెటా ఇన్‌స్టాగ్రామ్‌  ఫోటో-షేరింగ్ లేదా మల్టీ మీడియా ప్లాట్‌ ఫారమ్‌గా కొనసాగుతుండగా, ‘ థ్రెడ్స్’ అనేది టెక్స్ట్-ఆధారిత  యాప్ గా రూపొందించారు. మెటాకు Facebook ఉన్నప్పటికీ, ‘థ్రెడ్స్’ అనేది Twitter   పాత వెర్షన్‌ని పోలి ఉంటుంది.  ఇందులో ప్రతి పోస్ట్ గరిష్టంగా 500 అక్షరాల వరకు ఉండవచ్చు. లింక్‌లు, ఫోటోలు (ఒక పోస్ట్‌కు పది వరకు), 5 నిమిషాల నిడివి గల వీడియోలను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ‘థ్రెడ్స్’ పోస్ట్‌ కు ఎవరు రిప్లై ఇవ్వాలి అనే విషయాన్ని కూడా వినయోగదారులు నియంత్రించే అవకాశం ఉంటుంది.   మీరు త్రీ-డాట్ మెనుని నొక్కడం ద్వారా ‘థ్రెడ్స్’ పై ప్రొఫైల్‌ను అన్‌ఫాలో చేయవచ్చు. బ్లాక్ చేయవచ్చు. లేదంటే రిపోర్ట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు బ్లాక్ చేసిన ఏవైనా ఖాతాలు ఉంటే ఆటోమేటిక్ గా ‘థ్రెడ్స్’లో బ్లాక్ చేయబడతాయి.


ఇన్‌ స్టాగ్రామ్ ఆధారంగా పని చేయనున్న ‘థ్రెడ్స్’


ఈ యాప్ ఇన్‌ స్టాగ్రామ్ ఆధారంగా పనిచేస్తుంది. ట్విట్టర్ మాదిరిగా పోస్ట్ చేయవచ్చు. అలాగే, లైక్స్, కామెంట్స్, షేరింగ్ లాంటి ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత అతను తీసుకునే నిర్ణయాల కారణంగా చాలా మంది యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు.   ఇలాంటి సమయంలో జూకర్ బర్గ్ ‘థ్రెడ్స్’ యాప్‌ను తీసుకురావడం విశేషం. ఈ యాప్   సక్సెస్ అయితే  ట్విట్టర్ విషయంలో ఎలాన్ మస్క్ భారీ నష్టాన్ని చూసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే!


ట్విట్టర్ కు పోటీగా తీసుకొచ్చిన ‘థ్రెడ్స్’ యాప్ ఎలన్ మస్క్ స్పందించారు. ఓ నెటిజన్లు ఈ యాప్ మీద చేసిన అభిప్రాయాన్ని మస్క్ షేర్ చేస్తూ నవ్వు ఎమోజీ పెట్టారు. ‘థ్రెడ్స్’ యాప్ ను తీసుకొచ్చేందుకు మెటా కేవలం కీబోర్డులోని Crl+C+V (కాపీ పేస్ట్) కీలను మాత్రమే వినియోగించిందంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. లాఫింగ్ ఎమోజీని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.


Read Also: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial