Mark Zuckerberg Beef: మెటా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు బాస్ అయిన టెక్ బిలియనీర్ మార్క్ జుకర్‌బర్గ్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. కొంత కాలం క్రితమే రన్నింగ్, జుజుత్సులు నేర్చుకుంటూ ప్రపంచ స్థాయి కమాండోల ఫిట్‌నెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాగే ప్రస్తుతం ఆవులను పెంచుతున్నాడట. ఆవులకు డ్రైఫ్రూట్స్, బీర్ పోసి పెంచుతూ ప్రపంచంలోనే బెస్ట్ బీఫ్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని మార్క్ తన ఫేస్‌బుక్ పోస్టులో తెలిపాడు. హవాయిలోని కవాయి అనే ప్రాంతంలో సగం దీవులను మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే కొనుగోలు చేశాడు. అక్కడే ఈ ఆవులను పెంచుతున్నట్లు తెలిపాడు.


ఈ పోస్టులో మార్క్ జుకర్‌బర్గ్ ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. ఇందులో ఆయన ఒక రెస్టారెంట్‌లో కూర్చుని ఉండటం చూడవచ్చు. మార్క్ జుకర్‌బర్గ్ తాను పెంచుతున్న ఆవులకు మకడమియా నట్స్‌తో పాటు స్థానికంగా తయారు చేసిన బీర్‌ను ఆహారంగా ఇస్తున్నట్లు తెలిపారు.


పూర్తిగా ఆర్గానిక్ బీఫ్ కోసం అంట...
మార్క్ జుకర్‌బర్గ్ తనను తాను బాధ్యతగల పాడి రైతుగా ప్రకటించుకున్నాడు. ‘ఈ మొత్తం ప్రాసెస్‌ని లోకల్‌గా ఉంచాలనుకుంటున్నాం. ప్రతి ఆవు సంవత్సరానికి ఐదు వేల నుంచి 10 వేల పౌండ్ల వరకు ఆహారం తింటుంది. అంటే దాని కోసం ఎన్నో ఎకరాల్లో మకడమియా చెట్లు పెంచాల్సి ఉంటుంది. నా కూతుర్లు ఈ చెట్లను జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే మా జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది.’ అని పోస్టులో రాశాడు. ‘ఈ ప్రయాణంలో మేం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. ప్రతి సీజన్‌కు మెరుగుపడటం చాలా ఆనందంగా ఉంది. నా ప్రాజెక్టులన్నిటిలో ఇదే రుచికరమైనది.’ అని కూడా తెలిపాడు.


మార్క్ జుకర్‌బర్గ్ పోస్టుపై నెటిజన్ల నుంచి విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు అతని అభిప్రాయాలను పొగుడుతూ ఉండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎంతో మంది శాకాహారులు అతన్ని హిపోక్రైట్ అంటూ విమర్శిస్తున్నారు. ఒకవైపు ఆవులను బాగా చూసుకుంటూనే, మరోవైపు బీఫ్ కోసం అని చెప్పడం అతని ద్వంద్వ వైఖరిని సూచిస్తుందన్నారు. ‘ధనాన్ని, భూమిని, వనరులని వృథా చేయడమే.’ అని కొందరు విరుచుకుపడుతున్నారు.


సాధారణంగా ప్రపంచ కుబేరులకు చిన్న చిన్న ప్రాజెక్టులు, హాబీలు ఉంటూనే ఉంటాయి. ఉదాహరణకు కొందరు లగ్జరీ షిప్‌లు, ప్రైవేట్ జెట్లు మెయింటెయిన్ చేస్తూ ఉంటారు. ప్రైవేటు దీపాల్లో ఇళ్లు కట్టుకుని నివసించే వారు కూడా లేకపోలేరు. ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ బీఫ్ వైపు తన ఆసక్తి చూపించారు. మరో టెక్ బిలియనీర్ బిల్ గేట్స్ అభిరుచి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ల్యాబ్‌లో పెంచే గడ్డిపై ఆయన ఆసక్తి చూపించారు. ధనిక దేశాలన్నీ జంతువుల మాంసం కాకుండా సింథటిక్ మాంసం వైపు మళ్లితే వాతావరణంలో మంచి మార్పులు వస్తాయని బిల్ గేట్స్ ఒకసారి ఎంఐటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!