మైక్రోసాఫ్ట్ కొత్త బడ్జెట్ ల్యాప్‌టాప్ అమెరికాలో లాంచ్ అయింది. అదే సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2. 2020లో లాంచ్ అయిన ఒరిజినల్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ గోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ఉన్న ఈ ల్యాప్‌టాప్‌లో 16 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంది.


మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 ధర
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 599.99 యూరోలుగా (సుమారు రూ.46,500) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 699.99 డాలర్లుగానూ (సుమారు రూ.54,300), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 799.99 యూరోలుగానూ (సుమారు రూ.62,000) నిర్ణయించారు.


టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,099.99 డాలర్లుగా (సుమారు రూ.85,300) ఉంది. సేజ్, ప్లాటినం, ఐస్ బ్లూ, శాండ్‌స్టోన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 స్పెసిఫికేషన్లు
ఇందులో 12.4 అంగుళాల పిక్సెల్‌సెన్స్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 3:2గా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 1536 x 1024 పిక్సెల్స్‌గా ఉంది. ఇంటెల్ కోర్ ఐ5 11వ తరం ప్రాసెసర్ ఇందులో ఉంది. 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.


దీని ట్రాక్ ప్యాడ్ పెద్దగా ఉండనుంది. విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 13.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుందని తెలుస్తోంది. 39W ఫాస్ట్ చార్జర్‌ను ఇందులో అందించారు. డాల్బీ ఆడియో ప్రీమియం సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!