అసుస్ మనదేశంలో ఫోల్డబుల్ స్క్రీన్ ఉన్న కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో 17.3 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,920×2,560 పిక్సెల్స్ కాగా, యాస్పెక్ట్ రేషియో 4:3గానూ, రెస్పాన్స్ టైం 0.2 మిల్లీ సెకన్లుగానూ ఉంది. గతేడాది లెనోవో థింక్ ప్యాడ్ ఎక్స్1 ఫోల్డ్ కూడా ఇటువంటి డిస్‌ప్లేతోనే మనదేశంలో లాంచ్ అయింది.


అసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ధర
దీని ధరను మనదేశంలో రూ.3,29,990గా నిర్ణయించారు. అసుస్ ఈ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్‌లో దీన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌లో అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, రోగ్ స్టోర్లు, ఇతర అసుస్ అప్రూవ్డ్ డీలర్ల వద్ద ఇది అందుబాటులో ఉండనుంది.


అసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 17.3 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,920×2,560 పిక్సెల్స్ కాగా, యాస్పెక్ట్ రేషియో 4:3గానూ, రెస్పాన్స్ టైం 0.2 మిల్లీ సెకన్లుగానూ, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గానూ ఉంది. దీని డిస్‌ప్లే సైజు ఫోల్డ్ చేసినప్పుడు 12.5 అంగుళాలకు తగ్గనుంది. దీని యాస్పెక్ట్ రేషియో 3:2గా ఉంది.


ఇందులో 75Whr బ్యాటరీని అందించారు. దీన్ని పూర్తిగా చార్జ్ చేశాక ఫోల్డ్ చేసి ఉపయోగిస్తే 9.5 గంటలు, ఫోల్డ్ చేయకుండా ఉపయోగిస్తే 8.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుందని కంపెనీ అంటోంది. యూఎస్‌బీ టైప్-సీ 64W పవర్ అడాప్టర్‌తో దీన్ని చార్జ్ చేయవచ్చు. ఇందులో టచ్‌ప్యాడ్‌ను అందించారు. దీంతోపాటు రెండు థండర్ బోల్ట్ 4 పోర్టులు, 3.5 ఎంఎం కాంబో ఆడియో జాక్ కూడా ఉంది.


ఈ ల్యాప్‌టాప్‌లో 12వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను అందించారు. 16 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ ఎం.2 ఎన్‌వీఎంఈ పీసీఐఈ 4.0 ఎస్ఎస్‌డీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ కూడా ఉంది. 5 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 3డీ నాయిస్ రిడక్షన్, ఐఆర్ ఫంక్షన్, నాలుగు స్పీకర్ల సెటప్ ఉంది. ఈ నాలుగు స్పీకర్లకు హర్మాన్ కార్డన్ సర్టిఫికేషన్ అందించారు. డాల్బీ అట్మాస్ సౌండ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ల్యాప్‌టాప్‌లో అందించిన ఇన్‌బిల్ట్ మైక్ ద్వారా అలెక్సా లేదా కోర్టానాను ట్రిగ్గర్ చేయవచ్చు.