జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో దీపావళి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడు లాంచ్‌కు ముంగిట వీటికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ ఆన్‌లైన్‌లో టీజ్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. గూగుల్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్‌లో క్వాల్‌కాం చిప్‌సెట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. వాయిస్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.


దీంతోపాటు వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ప్రీలోడెడ్ గూగుల్, జియో యాప్స్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన డిజైన్ డిటైల్స్ కూడా టీజర్ వీడియో ద్వారా బయటకువచ్చాయి. జియో రూపొందిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో అసెంబుల్ చేశారు. ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌ను ప్రత్యేకంగా భారతీయుల కోసమే రూపొందించారు.


ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంను ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తూ.. మంచి పెర్ఫార్మెన్స్ అందించేలా ఆప్టిమైజ్ చేశారని కంపెనీ ప్రకటించింది. దీనికి ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు అందించనున్నారు. విడుదల చేసిన టీజర్ వీడియోలో ఈ ఫోన్‌ను రకరకాల యాంగిల్స్ నుంచి చూపించారు.


మైక్రో యూఎస్‌బీ పోర్టు, కెపాసిటివ్ టచ్ బటన్లు, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. క్యాప్యూల్ ఆకారంలో ఈ కెమెరా మాడ్యూల్‌ను అందించనున్నారు. కెమెరా సెన్సార్ కిందనే ఫ్లాష్ కూడా ఉంది. పొర్‌ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, సరౌండింగ్ ది డిస్‌ప్లే కూడా ఇందులో ఉన్నాయి.


ఇందులో వాయిస్ అసిస్టెంట్‌ను కూడా అందించనున్నారు. దీంతో మీ ఫోన్‌ను వాయిస్ కమాండ్స్‌తో ఆపరేట్ చేయవచ్చు. ఓపెన్ యాప్, మేనేజ్ సెట్టింగ్స్ వంటి కమాండ్స్‌కు ఈ స్మార్ట్ ఫోన్ స్పందిస్తుంది. దీంతోపాటు ఇందులో రీడ్ అలౌడ్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా ఆన్ స్క్రీన్ కంటెంట్‌ను స్పీకర్ల ద్వారా వినవచ్చు. దీంతో పాటు ఇందులో ట్రాన్స్‌లేట్ ఫంక్షన్ కూడా ఉంది. దీని ద్వారా వినియోగదారులు టెక్స్ట్‌ను తమకు కావాల్సిన భాషకు అనువదించుకోవచ్చు.


జియోఫోన్ నెక్స్ట్‌లో క్వాల్‌కాం ప్రాసెసర్‌ను అందించనున్నారు. అయితే అది ఏ చిప్ మోడలో తెలియరాలేదు. తాజా గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని ధర రూ.3,499 మాత్రంగానే ఉండనుందని గతంలో లీకులు వచ్చాయి. అసలు ధర తెలియాలంటే మాత్రం ఇంకో పది రోజులు ఆగాల్సిందే!


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి