ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5జీ ఫీచర్ కూడా ఉండనుంది. గతంలో వచ్చిన ఐఫోన్ ఎస్ఈ (2020)కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 8వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ కథనంలో పేర్కొన్నారు. అదేరోజు కొత్త ఐప్యాడ్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.


ఈ కథనం ప్రకారం.. కొత్త ఐఫోన్ ఎస్ఈలో 5జీ కనెక్టివిటీ ఉండనుంది. దీంతోపాటు మెరుగైన కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్ కూడా ఇందులో అందించనున్నారు. త్వరలో యాపిల్ రెండు కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఇందులో మరింత శక్తివంతమైన ప్రాసెసర్లను యాపిల్ అందించనుంది.


ఈ విషయమై యాపిల్ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్‌సెట్ల కొరత నెలకొంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒకవేళ ఈ ఫోన్ లాంచ్ అయినా... ఈ కొరత కారణంగా సేల్‌కు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.


ఏ2595, ఏ2783, ఏ2784 మోడల్ నంబర్లతో మూడు ఐఫోన్లు, ఏ2588, ఏ2589 మోడల్ నంబర్లతో రెండు కొత్త ఐప్యాడ్లు లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ ఎస్ఈ ధర 300 డాలర్ల రేంజ్‌లో (రూ.22,500), ట్యాబ్లెట్ల ధర 500 డాలర్ల (సుమారు రూ.37,400) నుంచి 700 డాలర్ల (సుమారు రూ.52,400) మధ్యలో ఉండే అవకాశం ఉంది.


ఐఫోన్ ఎస్ఈ 3 డిజైన్ ఇంతకు ముందు లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ (2020) తరహాలోనే ఉండనుందని తెలుస్తోంది. అయితే ఇందులో 5జీ కనెక్టివిటీ, యాపిల్ ఏ15 బయోనిక్ చిప్, 3 జీబీ ర్యామ్ కూడా యాపిల్ అందించనున్నారని వార్తలు వస్తున్నాయి.