Apple Offers: యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న వాలంటైన్స్ డే మొబైల్ బొనాంజా సేల్‌లో ఈ ఆఫర్ అందించారు. ఈ సేల్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. వీటిలో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు.
ఐఫోన్ 15 ధర, ఆఫర్ వివరాలు
ఐఫోన్ 15 ధర లాంచ్ అయినప్పుడు మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం అయ్యేది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇప్పుడు దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.66,999కు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.64,999కే విడుదల కానుంది. అంటే దాదాపు రూ.15 వేల వరకు తగ్గింపు లభించనుందన్న మాట. 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఐఫోన్ 15, 15 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐఫోన్ 15లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందించారు. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. గతేడాది ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ వీటిలో కూడా ఇచ్చారు. ఏకంగా 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఐఫోన్ 15 అందించనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను యాపిల్ అందించింది.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌ల్లో వెనకవైపు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరా అందించడం విశేషం.
ఏ16 బయోనిక్ చిప్‌పై ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లు పని చేయనుండటం విశేషం. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఈ ప్రాసెసర్ అందించారు. యూఎస్‌బీ టైప్-సీతో లాంచ్ అయిన మొదటి యాపిల్ ఐఫోన్ సిరీస్ ఇదే.
మరోవైపు మోటో జీ04 స్మార్ట్ ఫోన్ భారతదేశంలో వచ్చే వారం లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మోటొరోలా జీ సిరీస్‌లో లేటెస్ట్ ఎంట్రీగా ఈ ఫోన్ లాంచ్ కానుండటం విశేషం. ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉండటం విశేషం. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉండనుందని తెలుస్తోంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై మోటో జీ04 పని చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉండనుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?