ఇన్‌స్టాగ్రామ్‌లో భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి సమస్యలు తలెత్తాయి. కొందరు వినియోగదారులు వారి ఖాతాలను సస్పెండ్ చేసినట్లు రిపోర్ట్ చేస్తున్నారు. DownDetector ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఈ సమస్య బారిన పడ్డారు.


అంతరాయానికి కారణం స్పష్టంగా తెలియనప్పటికీ చాలా మంది వినియోగదారులు తమ ఖాతాలను సస్పెండ్ చేసినట్లు నివేదించారు. సస్పెండ్ చేయబడిన వినియోగదారుల ఖాతాలను లెక్కలో నుంచి తీసేసినట్లు చూపిస్తున్నారు. దీంతో చాలా మందికి ఫాలోవర్లు కూడా తగ్గుతున్నారు.


ఇప్పటివరకు డౌన్‌డెటెక్టర్‌లో 4,000 కంటే ఎక్కువ మంది ఈ సమస్యను రిపోర్ట్ చేశారు. UKలోని వినియోగదారుల నుండి 1,000 కంటే ఎక్కువ సమస్యలు నివేదించారు. ఈ అవుటేజ్ ద్వారా ప్రభావితమైన వినియోగదారులకు వారి సస్పెన్షన్‌పై అప్పీల్ చేయడానికి అవకాశం ఇస్తారు. 


చాలా మంది వినియోగదారులు తాము ఈ ప్రాబ్లమ్‌ను రిపోర్ట్ చేయడానికి ట్విట్టర్‌లోకి వచ్చారు. గత వారమే వాట్సాప్ రెండు గంటలపాటు అంతరాయాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో వాట్సాప్ మెసేజ్‌లు వెళ్లలేదు, రిసీవ్ అవ్వలేదు. అలాగే ఇతర ఫీచర్లు కూడా అందుబాటులోకి రాలేదు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్... ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలూ మెటా కిందకే వస్తాయి.


ఈ సమస్యపై ఇన్‌స్టాగ్రాం స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో కొందరికి సమస్యలు ఉన్న సంగతి తమ దృష్టికి వచ్చిందని ఈ సమస్యను తాము వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పేర్కొంది.