CM Jagan : ప్రగతిని అందమైన అంకెల రూపంలో చూపకుండా, వాస్తవ రూపంలో ఉండాలని సీఎం జగన్ అన్నారు. ప్రతి అంశంలో  సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తీసుకువచ్చిందని వివరించారు. అలాంటి గ్రామ, వార్డు సచివాలయాల నుంచి నిరంతర పర్యవేక్షణ, చేస్తున్న ప్రగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం  చాలా ముఖ్యమైన అంశాలుగా గుర్తించాలని ఆయన అధికారులతో అన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధన పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ ఆధార్‌ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా నిక్షిప్తం చేయడంతో పాటు వచ్చిన మార్పులను చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని ఆదేశించారు. 


సచివాలయాలను ఓనర్ షిప్ చేసుకోవాలి


సుస్థిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలని, సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులను నియమించాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన విభాగాధిపతి ప్రతినెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని,ఆ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఏ రకంగా పనిచేస్తున్నారు, ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఏ రకంగా పనిచేస్తున్నారో పరిశీలన చేయాలన్నారు. దీనివల్ల సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని, అవగాహనతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతుంది? అన్న విషయంపై జేసీలు, కలెక్టర్లు కూడా పరిశీలన చేయాలని, దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుందన్నారు. దేశంలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలుస్తుందని, గ్రామ, వార్డు సచివాలయాలను ఓనర్‌షిప్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 


నెలలో కనీసం రెండు సార్లు 


ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవంతో పాటు సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్‌ఓపీలను మరోసారి పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు అవసరమైతే చేయాలన్నారు సీఎం జగన్. నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలని, కలెక్టర్లు, జేసీలు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారో కూడా పరిశీలన చేయాలన్నారు. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయడంలేదని వివరించారు. ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల రోజులకోసారి వివరాలు నమోదు కావాలని, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి సాంకేతికతను వాడుకోవాలన్నారు.


డ్రాప్ అవుట్స్ ను నిలువరించాలి 


పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూదని, డ్రాప్‌ అవుట్స్‌ అన్న మాట ఎక్కడా వినిపించకూడదని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాల వారీగా, వాలంటీర్ల వారీగా పర్యవేక్షణ చేయాలని, ఎప్పటికప్పుడు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడైనా డ్రాప్‌ అవుట్‌ ఘటన తెలిస్తే వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరును పరిశీలించాలన్నారు. పిల్లలు ఎవరైనా వరుసగా 3 రోజులు స్కూల్ కు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరాతీయాలన్నారు. పిల్లలు స్కూలుకు రాకపోతే కచ్చితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపాలన్నారు.