Vja Murder Case : బెజవాడలో సంచలనం రేకెత్తించిన బిల్డర్ రాజు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు 30 గ్రాముల బంగారంతో పాటుగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం అక్టోబర్ 31 తేదీ అర్ధరాత్రి సమయంలో శాంతినగర్, దేవినేని గాంధీపురం కు చెందిన పీతల అప్పలరాజు అలియాస్ బిల్డర్ రాజు తాను ఉంటున్న ఇంటిలో తలపై గాయాలతో చనిపోయి ఉన్నట్లు గుర్తించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏడాది తర్వతా వీడిన బిల్డర్ రాజు మర్డర్ మిస్టరీ
సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనుమానితులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.హతుడు పీతల అప్పలరాజు @ బిల్డర్ రాజు విశాఖపట్నం నివాసి, ఇతను బిల్డింగ్ పనుల నిమిత్తం విజయవాడ దేవినగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో హతుని వద్ద తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న కొటారి సాయి కుమార్ (39 సం.) తో పరిచయం ఏర్పడి ఒంటరిగా ఉంటున్న హతునికి సాయి కుమార్ భోజన ఏర్పాట్లు చూసేవారు. ఈ క్రమంలో సాయికుమార్ అద్దెకు ఉంటున్న ఇంటి పైకి హతుడు అద్దెకు దిగాడు. సాయి కుమార్ భార్య సుధా రేవతి కూడా రాజు బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం అలాగే టిఫిన్, భోజనం వండడం, వాటిని పైకి తీసుకుని వెళ్లి రాజు కి వడ్డించేది.
ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి భార్యపై కన్నేసిన బిల్డర్ రాజు
ఈ క్రమంలో హతుడు రేవతి ని కోరిక తీర్చమని ఇబ్బంది పెడుతూండేవాడు. ఈ విషయం సాయికుమార్ భార్య తన భర్తతో చెప్పింది. వేధింపులు ఎక్కువ కావడంతో భర్త సాయి కుమార్ కుటుంబ సభ్యులు భవాని శంకర్, శివపార్వతి, చూడామణి లకు చెప్పిన,సాయి కుమార్ బిల్డర్ రాజును చంపాలని నిర్ణయించుకున్నారు.అయితే హతుడు రాజు బలంగా ఉంటారు, కాబట్టి ప్రతిఘటిస్తే ఎలా అని ఆలోచన చేశారు. సమయంలో విషం పెట్టి చంపేద్దాము అని శివపార్వతి, చూడామణి సలహా ఇచ్చారు. వెంటనే వారి సలహా మేరకు ఎలకల మందు కొని భోజనంలో కలిపి రాజుకు రేవతి ద్వారా పంపించారు. హతుడు రాజు తిన్న తరువాత మత్తులోకి జారుకుని ఉండటంతో అదే అదునుగా చేసుకుని సాయి కుమార్ మరియు భవాని శంకర్లు ఇంటిలోకి ప్రవేశించి ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టారు.
కుటుంబసభ్యులందరితో కలిసి చంపేందుకు సాయికుమార్ ప్లాన్
హతుడు ప్రతిఘటించడానికి ప్రయత్నించిన సమయంలో రేవతి, హతుని కాళ్ళు పట్టుకుని కదలకుండా సహకరించింది. చనిపోయాడు అని నిర్ణయించుకున్న తరువాత ఆనవాళ్ళు కనబడకుండా ఉండేందుకు ఇంటిని పూర్తిగా శుభ్రం చేశారు.విచారణ క్రమంలో నిందితుల కదలికలు అనుమానంగా ఉండటంతో మరియు వీరిపై ప్రత్యేక బృందాలు మరింత లోతుగా వివరాలను సేకరిస్తున్న సమయంలో,పూర్తి సమాచారం మేరకు విచారణ జరిపి నిందితులు దేవినేని గాంధీపురం ప్రాంతానికి చెందిన వారందర్నీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను మరియు చోరి చేసిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.