Vijayawada News: ఏడాది కిందట విజయవాడలో సంచలనం సృష్టిచిన బిల్డర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 2021 నవంబర్ 1వ తేదీన విజయవాడ శివారు పాయకాపురం ప్రాంతంలోని 61వ డివిజన్ లో దేవినేని గాంధీపురంలో పీతల అప్పలరాజు అలియాస్ రాజు అనే బిల్డర్ దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్ లో కొన్నేళ్ల నుంచి బిల్డర్ గా చేస్తున్న అతడు ఆర్థికంగా కూడా స్థితిమంతుడు. అయితే ఎవరితోనూ గొడవ కూడా పడని అతడిని ఎవరో దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముఖం, తలభాగంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ జాగిలాలను రంగంలోకి దించగా.. స్థానికంగా ఉన్న ఇళ్ల మధ్యనే కాసేపు తిరిగింది. అనంతరం వాంబే కాలనీ రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్దకు వెళ్లి ఆగిపోయింది. 


మృతుడిపై విష ప్రయోగం జరిగిందని రిపోర్టులు..


మృతుడి ఫోన్ రికార్డులతో పాటు మద్యం దుకాణం, స్థానిక ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. రాజు ఉండే కింది అంతస్తులోనే అతని వద్ద పనిచేసే సూపర్ వైజర్ సాయి కుమార్ ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వారిని విచారించారు. పది రోజుల పాటు పలు కోణాల్లో ప్రశ్నించగా.. వీరి బంధువులు, రాజుతో పాటు ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెడుతున్నారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటన్ వేశారు. దీంతో పోలీసలు వెనక్కి తగ్గారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం... మృతుడిపై విష ప్రయోగం జరిగిందని తేలింది. కానీ ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు అటకెక్కింది. అయితే మృతుడి భార్య రెండు నెలలుగా తన భర్తను కేసును విచారించాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతోంది. దీంతో కేసు మళ్లీ గాడిన పడింది. సాయి కూమార్ పై పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలోనే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. 


ముందుగా చేపల పులుసులో ఎలుకల మందు పెట్టి..


పీతల అప్పలరాజు అలియాస్ రాజు దేవినేని గాంధీపురంలో ఒంటరిగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే ఆయన కుటుంబం విశాఖపట్నంలో ఉంటోంది. విజయవాడలో పని చేసుకుంటూ ఉండే రాజు.. పది, పదిహెను రోజులకోసారి విశాఖపట్నంలోని కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వచ్చేవాడు. అయితే రాజు ఉంటున్న భవనం కింది అంతస్తులోనే సూపర్ వైజర్ సాయి కుమార్ నివాసం ఉండే వాడు. బిల్డర్ ఒక్కడే ఉంటుండడంతో సాయి కుమార్ భార్య సుధనే అతడికి వంచ చేసి ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజు ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. విషయం తెలుకున్న సాయి కుమార్ రాజును చంపేందుకు పథకం వేశాడు. ముందుగా సుపారీ ఇవ్వాలని భావించినప్పటికీ.. అంత డబ్బులేక తానే హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ 31వ తేదీ రాత్రి చేపల పులుసులో ఎలుకల మందు కలిపి భోజనం ఇచ్చి వచ్చింది సుధ. 


అపై రాడ్డుతో కొట్టి..


తిరిగి వచ్చేటప్పుడు గడియ వేయలేదు. అర్ధరాత్రి సమయంలో సుధ, సాయి కుమార్, భవానీ శకర్ లు రాజు గదిలోకి వెళ్లారు. విషాహారం తిని అప్పటికీ చనిపోకపోవడంతో రాడ్డుతో కొట్టి హత్య చేశారు. దొంగతనంగా చిత్రీకరించేందుకు ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసుతో పాటు, ఉంగరాలను తీసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా సాయి కుమార్ యే పోలీసులకు తెలిపాడు. అయితే నిందితులు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ఎలుకల మందు కొనుగోలు చేసిన దుకాణంతో పాటు అతని వద్ద నుంచి తీసుకున్న బంగారం విక్రయించిన దుకాణాలకు వెళ్లి వివరాలు సేకరించారు. అలాడే వాటిని రికవరీ చేుకున్నారు. హత్య చేసేందుకు ఉపయోగించిన రాడ్డును ఇంటి వెనకాల చెరువులో వెతికి మరీ స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఐదుగురి ప్రమేయం ఉందని.. మరికొన్నిరోజుల్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెబుతున్నారు.