Chinese Phone Ban: బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే దేశం చైనా. ఎందుకంటే ఐ ఫోన్‌కు కూడా బడ్జెట్‌లో అదే ఫీచర్లతో డూప్ దింపుతోంది చైనా. ప్రస్తుతం భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను చైనా కంపెనీలే ఏలుతున్నాయి. అయితే ఇక ఆ కంపెనీలకు కష్టాలు మొదలుకానున్నాయి. ఎందుకంటే ఈ చైనా కంపెనీలకు చెక్ పెట్టాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. 


ఆ స్మార్ట్ ఫోన్లు 


దేశంలో రూ.12,000 లోపు ధర కలిగిన బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లు విక్రయించకుండా మోదీ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. షియోమీ, ఒప్పో, రియల్‌మీ, వివో తదితర చైనా కంపెనీలపై ఈ మేరకు ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


మేక్ ఇన్ ఇండియా


దేశీయ మొబైల్‌ బ్రాండ్లకు మార్కెట్‌ అవకాశాలు పెంచడం కోసమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. మన బడ్జెట్‌, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీలదే హవా. మార్కెట్‌ వాటా పరంగా టాప్‌-5 కంపెనీల్లో సామ్‌సంగ్‌ మినహా మిగతా నాలుగు చైనావే. కనీసం టాప్‌-10లో కూడా ఒక్క దేశీయ బ్రాండ్‌ లేదు.


షియోమీపై


బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధిస్తే చైనా కంపెనీలపై ప్రధానంగా షియోమీపై భారీ ప్రభావం పడుతుంది. ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి నమోదైన భారత స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో మూడో వంతు వాటా రూ.12,000 లోపు ధర కలిగిన మొబైల్స్‌దే. అందులోనూ 80 శాతం వాటా చైనా కంపెనీలదే.


పన్ను ఎగవేత


గత ఏడాది డిసెంబరులో ఒప్పోతో పాటు చైనాకు చెందిన ఇతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల ప్రాంతాల్లో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ కూడా సోదాలు నిర్వహించింది. చైనా కంపెనీలు భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు ఈ దాడుల్లో గుర్తించారు. ఈ కంపెనీలపై రెవెన్యూ నిఘా విభాగం (డీఆర్‌ఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తులు కూడా కొనసాగుతున్నాయి.


యాప్స్‌పై


ఇప్పటికే టిక్‌టాక్‌, వీచాట్‌, పబ్​జీ సహా చైనాకు చెందిన 300కు పైగా చైనా యాప్‌లను మన ప్రభుత్వం నిషేధించింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు విరుద్ధంగా ఈ యాప్స్​ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. చైనాతో గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.


చైనా యాప్స్​ను విడతలవారీగా నిషేధించింది భారత్. తొలుత టిక్​టాక్​ వంటి యాప్స్​పై వేటు వేసింది. ఆ తర్వాత పబ్​జీతో పాటు బైడు, ఫేస్​యూ, కామ్​కార్డ్​ ఫర్​ బిజినెస్​, వీచాట్​ రీడింగ్​, యాప్​లాక్ వంటి 118 యాప్స్​పై బ్యాన్ వేసింది.


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 12 వేల మందికి వైరస్


Also Read: Mother and Son Govt Jobs: ఆ తల్లీ కుమారుడు అదుర్స్, ఒకేసారి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు