Mother and Son Government Jobs: ప్రస్తుత కాలంలో పిల్లలను చదివించడం తల్లితండ్రులకు చాలా కష్టంగా మారుతోంది. ఒకప్పుడు అంటే పిల్లలు స్కూల్ కు వెళ్లి వచ్చే వాళ్లు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా హోం వర్క్ ఉంటే వారే స్వయంగా చేసుకునే వారు. డౌట్స్ ఉంటే స్నేహితుల ఇళ్లకు పరిగెత్తి తమకు తెలియని విషయాలపై అవగాహనా పెంచుకునేవారు. ఎంత హోం వర్క్ ఇచ్చినా, వాటిలో పిల్లలకు ఎన్ని డౌట్స్ ఉన్నా.. తల్లిదండ్రులు చెప్పే వాళ్లు కాదు. ముఖ్యంగా ఈ ధోరణి మధ్య తరగతి ఇళ్లలో ఎక్కువగా ఉండేది. 


తల్లిదండ్రులూ నేర్చుకుంటారు..


రోజులు మారాయి. ఇప్పటి పిల్లలు బడి నుండి ఇంటికి వచ్చాక, హోం వర్క్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు సాయం చేయాల్సిందే. ముఖ్యంగా కొవిడ్ వల్ల గత మూడేళ్లుగా పరిస్థితిలో చాలా మార్పులొచ్చాయి. పిల్లలు చదువులో ఎంత చురుకుగా ఉన్నారు. స్కూల్ లో టీచర్లు చెప్పేవి అర్థం అవుతుందా.. లేదా.. ఇంకా ఎంత చదివించాలి. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులకు ఏరోజుకు ఆరోజు తెలుస్తుంది. అందుకే తల్లిదండ్రులు కూడా వారికి చెప్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పిల్లలు అడిగే డౌట్లు ప్రతీసారి అంత సులువుగా ఏమీ ఉండవు. వాళ్లు అడిగే ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉండాల్సిన నియమం కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి. దాని గురించి తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. ఇంటర్ నెట్ అందుబాటులో ఉంటే అందులో శోధించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. అలా పిల్లలకు చెబుతూ తల్లిదండ్రులు కూడా నేర్చుకుంటారు. కేరళలో ఒకేసారి తల్లికి, కుమారుడికి జాబ్ వస్తే ఎలా ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


తల్లీకొడుకులకు సర్కారు కొలువు..


ప్రభుత్వ ఉద్యోగాల కోసం పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏళ్లకు ఏళ్లు కష్టపడతారు. రోజూ 12 నుండి 16 గంటల పాటు చదువుతూనే ఉంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులు. అంత కష్టపడితే గానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదు. అలాంటి ఎంతో కష్టమైన ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇంటిల్లి పాది ఆనంద ఉత్సాహాల్లో మునిగి పోతారు. అలాంటి కష్టతరమైన ప్రభుత్వ ఉద్యోగం ఇంట్లో ఒకరికి వస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాంటిది ఒకేసారి ఇద్దరికి వస్తే పట్టలేనంత ఆనందం కుటుంబ సభ్యుల సొంతం అవుతుంది. అదీ తల్లీ కొడుకులకు ప్రభుత్వం ఉద్యోగం ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేరళలోని ఓ కుటుంబంలో ఇలాంటి అవధులు లేని ఆనంద ఉత్సాహం నెలకొంది. తల్లీ కొడుకులకు ఒకేసారి సర్కారు కొలువు వచ్చింది. 


తల్లికి 92వ ర్యాంకు.. కుమారుడికి 38


కేరళ రాష్ట్రంలోని మలప్పురమ్ కు చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. బిందు తన కుమారుడు 10వ తరగతిలో ఉన్నప్పుడు అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు పట్టారు. అలా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రాయాలని సంకల్పించారు. 9 ఏళ్ల తర్వాత తల్లీకొడుకులు ఇద్దరూ ఉద్యోగం సాధించారు. 42 ఏళ్ల బిందుకు.. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్ జీ ఎస్) పరీక్షలో 92వ ర్యాంకు వచ్చింది. 24 ఏళ్ల ఆమె కుమారుడికి లోవర్ డివిజనల్ క్లర్క్(ఎల్ డీ సీ) పరీక్షలో 38వ ర్యాంకు వచ్చింది.