Ticket booking: భారత దేశ రైల్వే వ్యవస్థ అతి పెద్దది. ఇక్కడ ఉన్నన్ని రైళ్లు, రైల్వే ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు మరెక్కడా ఉండరు. అంతలా దేశ వ్యాప్తంగా రైల్వే విస్తరించింది. ఇంత పెద్ద వ్యవస్థ అయినప్పటికీ.. దేశ జనాభాకు సరిపోవడం లేదు. రైలులో సుఖంగా ప్రయాణించాలంటే నెలల ముందు టికెట్లు బుక్ చేస్కోవాల్సిందే. లేక పోతే సీట్లు దొరకవు. మన అదృష్టం మరీ ఎక్కువైతే తప్పితే తత్కాల్ లో కూడా సీట్లు దొరకవు. ఇక వెయిటింగ్ లిస్టు అనేది నిజంగా ఓ బ్రహ్మ పదార్థం లాంటిదే. సీట్లు దొరకవు అనుకున్నప్పుడు దొరుకుతాయి. తప్పకుండా దొరుకుతాయి అనుకున్నప్పుడు అస్సలే దొరకవు.
5 నిమిషాల ముందు కూడా..
సీట్లు బుక్ కానప్పుడు జనరల్ బోగీలే దిక్కు. అందులో ప్రయాణించడం సాహసోపేతమనే చెప్పాలి. గొప్ప సాహస క్రీడ చేసినట్లుగానే ఉంటుంది. ఆ అవస్థ తీర్చేందుకు రైల్వే ఒక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇది ఇప్పుడు తాజాగా తీసుకువచ్చిందేం కాదు. కానీ చాలా మందికి దాని గురించి తెలియదు. ఆ సౌకర్యంతో రైలు ప్లాట్ ఫామ్ మీద నుండి బయలు దేరడానికి 5 నిమిషాల ముందు వరకు టికెట్ బుక్ చేసుకునే వీలు ఉంటుంది. అయితే ఆ రైలులో సీట్లు ఖాళీ ఉన్నట్లైతే ఎంచక్కా టికెట్ బుక్ చేసుకుని సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. ఈ టికెట్ ను ఆన్ లైన్ తో పాటు టికెట్ కౌంటర్ వద్ద కూడా పొందవచ్చు. ఎన్నో రోజుల నుండి ఈ అవకాశం అందుబాటులో ఉంది. కానీ, ఎవరూ ఎక్కువగా దీనిని ఉపయోగించుకోరు.
రెండు రకాల ఛార్ట్ లు..
సాధారణంగా రైలు ప్రయాణం వెనక చాలా ప్రయాసే ఉంటుంది. కానీ ఇవేవీ ప్రయాణికుడికి తెలియవు. రైలు బయల్దేరడానికి ముందు కొన్ని పద్ధతులను పాటిస్తారు అధికారులు. రైలు ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లే ముందు రైల్వే శాఖ రెండు ఛార్ట్ లను తయారు చేస్తుంది. అందులో మొదటిది రైలు ప్లాట్ ఫామ్ నుండి బయలు దేరడానికి 4 గంటల ముందు తయారు చేస్తారు. రెండవ చార్ట్ ను ప్రయాణానికి సరిగ్గా 30 నిమిషాల ముందు తయారు చేస్తారు. అందుకే రైలు బయలు దేరడానికి 30 నిమిషాల ముందు వరకు మాత్రమే టికెట్ బుకింగ్ కు అనుమతిని ఇచ్చేవారు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. సౌకర్యాలు పెరిగాయి. కాబట్టి, రైలు బయలు దేరడానికి 5 నిమిషాల ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులు బాటును రైల్వే శాఖ కల్పించింది. కాబట్టి 5 నిమిషాల ముందు వరకూ టికెట్లు బుక్ చేసుకునే వీలు ఉంటుంది. అప్పటి వరకు టికెట్ల కోసం ప్రయత్నించవచ్చు. అప్పటికీ టికెట్లు దొరక్కపోతే ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషించుకోవచ్చు.
మరొకరిపైనే ఆధారపడి ఉంటుంది..
రైలులో ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు చివరి నిమిషంలో ఆ టికెట్ క్యాన్సల్ చేసుకుంటే మాత్రమే ఈ సదుపాయం ద్వారా టికెట్ పొందగలం. అంటే వారు క్యాన్సిల్ చేసుకున్న సీటు మనకు వస్తుందన్నమాట.