Meta Safeguards: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీని పెంచేందుకు వీలుగా తీసుకురాబోతున్న సరికొత్త  యూజర్ నేమ్ ఫీచర్‌పై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయకుండా.. కేవలం ఎక్స్‌ట్రా ప్రైవసీ లేయర్‌గా యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసుకునే సౌకర్యాన్ని మెటా  సంస్థ ఇటీవల అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఫీచర్ రోల్ అవుట్‌ను తక్షణమే నిలిపివేయాలని డిరెక్ట్ చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ ఇండియా చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌కు సీరియస్ నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని గడువు విధించడం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది.

Continues below advertisement

సైబర్ ఫ్రాడ్‌లు పెరిగే ప్రమాదం

కేంద్ర ప్రభుత్వం ఈ ఫీచర్‌ను ఇంత తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం.. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న  డిజిటల్ అరెస్ట్ ,  ఫిషింగ్ ,  ఆన్‌లైన్ ఆర్థిక మోసాలే. ప్రస్తుతం వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా, ఇతరులకు మెసేజ్ చేయాలన్నా ఫోన్ నెంబర్ తప్పనిసరి. దీనివల్ల ఏదైనా నేరం జరిగినప్పుడు సదరు నెంబర్ ఏ టెలికాం ఆపరేటర్ పరిధిలో ఉంది, ఎవరి పేరిట కేవైసీ అయి ఉందనే ఆధారాల ద్వారా సైబర్ పోలీసులు నిందితులను సులభంగా ట్రాక్ చేయగలుగుతున్నారు. కానీ, ఫోన్ నెంబర్ స్థానంలో కేవలం యూజర్ నేమ్స్ మాత్రమే కనిపిస్తే, నేరగాళ్ల వెనుక ఉన్న అసలైన వ్యక్తిని గుర్తించడం  దర్యాప్తు సంస్థలకు అత్యంత క్లిష్టంగా మారుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక సామాన్య వినియోగదారుడు పెద్ద ప్రభుత్వ సంస్థల పేరిటో, ఫైనాన్షియల్ బ్యాంకుల పేరిటో, లేదా పబ్లిక్ అథారిటీస్ పేరిటో నకిలీ యూజర్ నేమ్స్ క్రియేట్ చేసి అమాయకులను సులభంగా నమ్మించి బురిడీ కొట్టించే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది.

Continues below advertisement

ఈ ఫీచర్ భారత్‌లో కష్టమే!

కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టం (IT Act) లోని  సెక్షన్ 79,  ఐటీ రూల్స్ 2021 లోని రూల్ 3, 4 లను ఉదహరిస్తూ ఈ నోటీసులు పంపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ వేదికలపై నేరాలను అరికట్టేలా, సందేశాల మూలాలను  గుర్తించేలా ఉండాలనేది భారత చట్టాల ముఖ్య ఉద్దేశం. వాట్సాప్ ప్రతిపాదిస్తున్న  యూజర్ నేమ్  వ్యవస్థ ఈ నిబంధనలను పరోక్షంగా బలహీనపరుస్తుందని, ఒకవేళ మెటా సంస్థ ఈ ఫీచర్ ద్వారా జరిగే మోసాలకు తగిన భద్రత కల్పించలేకపోతే, చట్టప్రకారం ఈ ఫీచర్‌ను భారతదేశంలో శాశ్వతంగా బ్లాక్ లేదా రిస్ట్రిక్ట్ చేసే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

ఎర్లీ టెస్టింగ్ అంటున్న మెటా 

 ఈ వ్యవహారంపై వాట్సాప్ మాతృసంస్థ 'మెటా' సమాధానం ఏంటంటే.. ఈ ఫీచర్‌ను తాము వినియోగదారుల భద్రత, ప్రైవసీని పెంపొందించడానికే డిజైన్ చేశామని స్పష్టం చేసింది. గ్రూపుల్లోని అపరిచితులకు లేదా కొత్త బిజినెస్ కాంటాక్ట్‌లకు మహిళలు తమ పర్సనల్ ఫోన్ నెంబర్లు ఇవ్వకుండా రక్షణ కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపింది. అంతేకాకుండా, ఈ ఫీచర్ ఇంకా పూర్తిస్థాయిలో లైవ్‌లోకి రాలేదని, కేవలం ఎర్లీ టెస్టింగ్ మాత్రమే నడుస్తోందని పేర్కొంది. స్కామ్స్ జరగకుండా తాము మల్టిపుల్ లేయర్స్ సెక్యూరిటీని డిజైన్ చేస్తున్నామని, యూజర్ నేమ్ గెస్ చేయకుండా లిమిట్స్ పెట్టడం, పిన్  ప్రొటెక్షన్ ఇవ్వడం వంటి సేఫ్‌గార్డ్స్ ఇందులో ఉంటాయని మెటా వివరణ ఇచ్చింది.

చాలా మార్పులు చేయాల్సిందే 

ఇక్కడ టెక్నాలజీ ప్రపంచంలో ఎప్పుడూ ఎదురయ్యే  వినియోగదారుడి ప్రైవసీ వర్సెస్ దేశ అంతర్గత భద్రత అనే ఘర్షణే మళ్లీ కనిపిస్తోంది. టెక్ కంపెనీ ప్రైవసీ కోణంలో ఆలోచిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం సైబర్ నేరగాళ్లు దీనిని ఒక కవచంలా వాడుకుని దేశ సరిహద్దులు దాటి డిజిటల్ దందాలు సాగిస్తారని భయపడుతోంది. వాట్సాప్ గనుక తన యూజర్ నేమ్స్ వెనుక ఉన్న ఫోన్ నెంబర్ల డేటాను అవసరమైనప్పుడు భారత దర్యాప్తు సంస్థలకు రియల్-టైమ్‌లో అందించేలా ఒక పటిష్టమైన మెకానిజంను క్రియేట్ చేసి, ప్రభుత్వానికి సంతృప్తికరమైన వివరణ ఇస్తేనే భారతదేశంలో వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌కు మోక్షం లభిస్తుంది. లేదంటే, మన దేశంలో ఈ ఫీచర్ హోల్డ్‌లోనే ఉండిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.