మీరు వాట్సాప్‌ను మెస్సేజ్‌లతో పాటు ఆడియో, వీడియో కాల్స్‌కు ఉపయోగిస్తుంటారు. అయితే ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్ అకౌంట్ ఉపయోగిస్తుంటే కనుక ఇది మీకు కచ్చితంగా శుభవార్త. ఈ ఫేమస్ మెసేజింగ్ యాప్ తాజాగా ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ యాక్టివిటీపై మరింత నియంత్రణ చేసే అవకాశం ఉంది. 

ఇకపై ఇతర డివైజ్ యాక్టివిటీపై అలర్ట్ వాట్సాప్ కొత్త అప్‌డేట్ తర్వాత, మీ WhatsApp అకౌంట్ ఏదైనా ఇతర లింక్డ్ డివైజ్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల మీ అకౌంట్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్ ఎందుకంత ముఖ్యం

ప్రస్తుతం నెటిజన్లు WhatsApp Web లేదా టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల వంటి అనేక డివైజ్‌లలో వాట్సాప్‌ వాడుతున్నారు. ఈ సౌకర్యం ఈజీగా ఉన్నప్పటికీ, ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. చాలా సార్లు వినియోగదారులు పబ్లిక్ లేదా ఆఫీస్ కంప్యూటర్లలో WhatsApp Web లాగిన్ చేసి, త్వరగా వెళ్లే హడావుడి, చాలా ఆలస్యం అయిందని లాగ్‌అవుట్ చేయడం మర్చిపోతుంటారు. అటువంటి పరిస్థితిలో మరొక వ్యక్తి వారి చాట్‌లను చూడటం, చాట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను కొత్త ఫీచర్ ద్వారా పరిష్కరించేందుకు మెటా సంస్థ ప్రయత్నిస్తోంది. 

డివైజ్‌లను ఎలా చెక్ చేస్తారు?

వాట్సాప్ యూజర్లు Linked Devices సెక్షన్‌లోకి వెళ్లి ఏయే డివైజ్‌లు కనెక్ట్ ఉన్నాయో మాన్యువల్‌గా చూసుకోవాలి. అక్కడ నుండి వారు ఏదైనా తెలియని డివైజ్‌ను లాగౌట్ చేయవచ్చు. కానీ చాలా మంది రెగ్యూలర్‌గా చెక్ చేయరు. దీనివల్ల ప్రైవసీతో పాటు డేటా సెక్యూరిటీ ముప్పు పొంచి ఉంటుంది.

కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

కొత్త ఫీచర్ సిస్టమ్ ఈ ప్రక్రియ మొత్తాన్ని లేకుండా చేస్తుంది. ఒకవేళ మీ మెయిన్ ఫోన్, ఏదైనా ఇతర డివైజ్ ఒకేసారి వాట్సాప్ అకౌంట్ యాక్టివ్‌గా ఉంటే, మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. ఉదాహరణకు, మీరు ఆఫీసు సిస్టమ్ లో WhatsApp Web లాగౌట్ చేయకుండా అలాగే వదిలేశారనుకోండి, ఎవరైనా దానిని ఉపయోగిస్తుంటే వెంటనే మీ ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. దీంతో మీరు వెంటనే లాగ్‌అవుట్ చేయడం లేదా ఇతర సేఫ్టీ యాక్షన్ తీసుకోవడం చేయవచ్చు.

నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మీ మెయిన్ డివైజ్ లేక ఫోన్, ఏదైనా ఇతర లింక్డ్ డివైజ్ ఒకే సమయంలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కేవలం ఒకే డివైజ్‌లో వాట్సాప్ వాడుతుంటే కనుక అలర్ట్ రాదు. 

ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుంది 

ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపించింది. రాబోయే అప్‌డేట్‌లలో దీనిని యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. దీనివల్ల మీ అకౌంట్ మునుపటి కంటే సురక్షితంగా ఉంటుంది.