Whatsapp: వాట్సాప్ అనేది నేటి డిజిటల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌గా మారింది. దీని ద్వారా ప్రజలు మెసేజ్‌లు మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, అనేక ఇతర రకాల సమాచారాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సార్లు వినియోగదారులు చట్టవిరుద్ధమైన సందేశాలు, ఫొటోలు/వీడియోలను తెలిసో తెలియకో షేర్ చేస్తారు. ఇండియాతో సహా అనేక దేశాలలో ఇటువంటి విషయాలపై కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారు.
అభ్యంతరకరమైన ఫొటోలు షేర్ చేస్తే అంతే...
అశ్లీల వీడియోలు, చిత్రాలు లేదా హింస, ద్వేషానికి సంబంధించిన మెసేజ్‌లు వంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంపడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఐటీ చట్టం ప్రకారం అసభ్యకరమైన విషయాలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధం. వీటికి కఠినమైన శిక్ష పడే నిబంధన ఉంది.
వాట్సాప్‌లో కొన్ని సార్లు తప్పుడు సమాచారం, పుకార్లను షేర్ చేస్తే అవి చాలా వేగంగా వైరల్ అవుతాయి. ఇది కొన్నిసార్లు సమాజంలో అశాంతి లేదా భయాందోళనలకు కారణమవుతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారం పంపడం వల్ల మీరు పోలీసు నిఘాలో పడవచ్చు.
Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?
మనోభావాలను దెబ్బతీయకూడదు...
వాట్సాప్‌లో మతపరమైన విషయాలపై తప్పుడు సమాచారం, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు లేదా ఫొటోలను పంపడం సామాజిక సామరస్యానికి భంగం కలిగించవచ్చు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం చట్టరీత్యా నేరం. దానికి జైలు శిక్ష విధిస్తారు.
బెదిరింపు మెసేజ్‌లు
ఒకరిని బెదిరించడం లేదా బెదిరింపు మెసేజ్‌లు పంపడం కూడా చాలా తీవ్రమైన నేరం. అది వ్యక్తిగతంగా అయినా లేదా గ్రూప్‌లో అయినా... అటువంటి బెదిరింపు మెసేజ్‌లను పంపినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
సెన్సిటివ్ గవర్నమెంట్ ఇన్ఫో షేర్ చేయకూడదు...
వాట్సాప్‌లో ఎలాంటి సెన్సిటివ్ లేదా సీక్రెట్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం నేరం. అటువంటి సమాచారాన్ని బహిరంగపరచడం జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది. దీనికి జైలు శిక్ష విధించే నిబంధన ఉంది. అందుకే వాట్సాప్‌లో ఏదైనా షేర్ చేసే ముందు అది చట్ట విరుద్ధమా కాదా అని కచ్చితంగా చెక్ చేసుకోండి. లేకపోతే మీరే చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!.