Tiger Tension In Mancherial District: మంచిర్యాల జిల్లాలో (Mancherial District) పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. పులి సంచారంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ.. 3 రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు స్థానికులు, అధికారులు పేర్కొంటున్నారు. శనివారం తెల్లవారుజామున పెద్ద ధర్మారం గ్రామానికి అతి సమీపంలోని రహదారిపై పులి అడుగులు కనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.


పంటచేన్లలో కాపలా ఉన్న కొందరు పెద్దపులి అరుపులు వినిపించినట్లు చెబుతున్నారు. ముత్యంపల్లి అటవీ సెక్షన్‌ పరిధిలోకి పెద్దపులి రావడంతో అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. పులిని గుర్తించేందుకు ట్రాకింగ్‌ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పులికి ఎలాంటి హానీ తలపెట్టకుండా ఉండేందుకు స్ధానిక అటవీ అధికారులు శివారు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు ఒంటరిగా తిరగవద్దని తమ పనులను ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు చేసుకోవాలన్నారు. పశువులు, మేకలు మేపుకోవడానికి అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని సూచించారు.


ఏపీలోనూ..


అటు, ఒడిశా సరిహద్దులో పులి సంచారంతో ఆంధ్రాలోనూ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా గంజాం, గజపతి జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి దారి తప్పి వచ్చిన పులిని అక్కడ అటవీశాఖ అధికారులు గుర్తించారు. బరంపురం సమీపాన జయంతిపురం వాసులు పులిని చూడడంతో ఆ ప్రాంత వాసుల్లో భయాందోళన నెలకొంది. అక్కడి ప్రజలు పులి ఎక్కడ వచ్చి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. నవంబర్ 3న రాత్రి జాతీయ రహదారి దాటుతున్న పులి ఓ కారులో అమర్చిన కెమెరాకు చిక్కింది. ఆ ప్రాంతం గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని భలియాగడ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిగా దాటుతున్న పులికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఒడిశా అటవీశాఖ అధికారులు అలర్టయ్యారు. పొలాల్లో పులి పాద గుర్తుల్ని అటవీ సిబ్బంది గుర్తించారు. దీంతో భలియాగడ, పల్లి, ఝింకిపదర్, ఘాటీకాళువ తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీ సిబ్బంది ఆయా గ్రామాల్లో మైకు ద్వారా ప్రచారం నిర్వహించి, ప్రజల్ని చైతన్యపరిచారు.


ప్రజలకు అలర్ట్


పశువుల్ని మేతకు బయటకు వదలొద్దని, ప్రజలు సాయంత్రం నుంచి తెల్లవారే వరకు ఇళ్ల నుంచి బయటకు ఒంటరిగా రావద్దని అధికారులు తెలిపారు. మ్యాటింగ్ సమయం వల్ల మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అటు, పులి సంచారం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సరిహద్దు వాసులను పలాస కాశీబుగ్గ రేంజ్ ఆఫీసరు మురళీ కృష్ణ అప్రమత్తం చేశారు. ఒడిశా బరంపురం ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున శ్రీకాకుళం జిల్లా వైపు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గట్టి నిఘా పెట్టామని, ప్రజలను  అప్రమత్తం చేశామని మురళి కృష్ణ తెలిపారు.


Also Read: Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం