Huawei Mate XT Ultimate Design: ప్రపంచంలోనే మొదటి ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ అయిన ‘హువావే మేట్ ఎక్స్‌టీ అల్టిమేట్ డిజైన్’ సేల్ చైనాలో ప్రారంభం అయింది. సరిగ్గా యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ల సేల్ ప్రారంభం అయిన రోజు దీని సేల్ చైనాలో మొదలయింది. అయితే ఈ స్పెషల్ ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటున్న యూజర్లకు మాత్రం నిరాశే ఎదురయిందట. కేవలం ప్రీ-ఆర్డర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఫోన్ విక్రయించాలని హువావే నిర్ణయించుకుందని తెలుస్తోంది. దీన్ని కేవలం లిమిటెడ్‌గానే విక్రయించాలని కంపెనీ డిసైడ్ అయిందట.


రాయిటర్స్ కథనం ప్రకారం... షెన్‌జెన్, బీజింగ్ నగరాల్లో ఈ ఫోన్ కొనడానికి స్టోర్లకు వెళ్లిన యూజర్లు నిరాశగా వెనుదిరిగారని సమాచారం. కేవలం ప్రీ ఆర్డర్ చేసుకున్న వారికే విక్రయిస్తామని స్టోర్‌కు వచ్చిన వినియోగదారులకు చెప్పారంట. కానీ బ్లాక్ మార్కెట్లో ఈ ఫోన్‌కు మంచి క్రేజ్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అసలు ధర కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువకు ఈ ఫోన్ విక్రయిస్తున్నారట.


హువావే మేట్ ఎక్స్‌టీ అల్టిమేట్ డిజైన్ ధర (Huawei Mate XT Ultimate Design Price)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అయింది. వీటిలో బేస్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 19,999 చైనీస్ యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.2,37,000) నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 21,999 చైనీస్ యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.2,60,800), 16 జీబీ ర్యామ్ + 1 టీబీ (1024 జీబీ) స్టోరేజ్ వేరియంట్ ధర 23,999 చైనీస్ యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.2,84,500) ఉంది.


షెన్‌జెన్‌లోని ఒక వెండర్ టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ (1024 జీబీ) స్టోరేజ్ మోడల్‌ను ఏకంగా 1.5 లక్షల చైనీస్ యువాన్లకు విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మనదేశ కరెన్సీలో ఏకంగా రూ.17.77 లక్షలు అన్నమాట. అంత పెట్టి కొన్న మహానుభావుడు ఎవరో మాత్రం తెలియరాలేదు. ఇది అసలు ధర కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


హువావే మేట్ ఎక్స్‌టీ అల్టిమేట్ డిజైన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Huawei Mate XT Ultimate Design Specifications)
హువావే మేట్ ఎక్స్‌టీ అల్టిమేట్ డిజైన్ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ ఫీచర్ అందుబాటులో ఉంది. హార్మొనీ ఓఎస్ 4.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఈ ఫోన్‌ను పూర్తిగా ఓపెన్ చేసినప్పుడు 10.2 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ స్క్రీన్ ఉపయోగించవచ్చు. ఒకసారి ఫోల్డ్ చేస్తే ఇది 7.9 అంగుళాల అంగుళాల డిస్‌ప్లేగా కన్వర్ట్ అవుతుంది. పూర్తిగా రెండు సార్లు ఫోల్డ్ చేస్తే 6.4 అంగుళాల డిస్‌ప్లే బయటవైపు ఉండనుంది.


తాజాగా వచ్చిన సమాచారం ఈ ట్రై ఫోల్డ్ ఫోన్‌లో ఆక్టాకోర్ కిరిన్ 9010 చిప్‌సెట్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్... 256 జీబీ స్టోరేజ్, 512 జీబీ స్టోరేజ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... హువావే మేట్ ఎక్స్‌టీ అల్టిమేట్ డిజైన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


హువావే మేట్ ఎక్స్‌టీ అల్టిమేట్ డిజైన్ స్మార్ట్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5600 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందో లేదో మాత్రం తెలియరాలేదు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?