Low Light Video Calling Mode In Whatsapp: వాట్సాప్ (Whatsapp) తమ వినియోగదారుల కోసం మరో అద్భుత ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో తక్కువ కాంతిలో (Light Mode) మసక వెలుతురులోనూ మెరుగైన క్వాలిటీతో వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ అప్‌డేట్‌తో తక్కువ వెలుతురు ఉన్న గదిలోనూ వీడియో కాల్స్‌ను సులభంగా చేసుకుని ఇష్టమైన వారితో మాట్లాడుకోవచ్చు. వినియోగదారులు తక్కువ లైటింగ్ సమయంలోనూ మెరుగైన వీడియో కాల్స్ చేసేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. వీడియో కాలింగ్ సమయంలో కొత్త ఫిల్టర్లు, బ్యాక్ గ్రౌండ్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు.
లైట్ మోడ్ అంటే.?
ఇది పేరుకు తగ్గట్టుగానే గదిలో కాంతి తక్కువగా ఉన్నా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇష్టమైన వారికి వీడియో కాల్ చెయ్యొచ్చు. వాట్సాప్‌లో వీడియో కాల్ నాణ్యత మెరుగుపరచడమే దీని లక్ష్యం. మీరు వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ పరిసరాల్లోని కాంతిని పరిశీలించి అందుకు తగ్గట్లుగా వీడియో కాల్‌కు అనువుగా లైట్‌ను అడ్జస్ట్ చేస్తుంది. మీ ముఖానికి ఎక్కువ వెలుతురు వచ్చేలా చేస్తుంది. చీకటిలో వీడియో స్పష్టతను డిస్ట్రబ్ చేసే గ్రైనినెస్‌ను తగ్గిస్తుంది. ఎలాంటి లైటింగ్‌లోనైనా మీ స్నేహితులు మిమ్మల్ని స్పష్టంగా చూడగలరు.
ఎలా యాక్టివేట్ చేయాలంటే.?
మీ ఫోన్ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి వీడియో కాల్ చేయండి. మీ వీడియోను ఫుల్ స్క్రీన్ చేయండి.
- లో - లైట్ మోడ్ యాక్టివేట్ చేయడానికి రైట్ సైడ్ పైన ఉన్న 'టార్చ్' గుర్తును ప్రెస్ చేయండి.
- తర్వాత లైట్ అడ్జస్ట్ చేయడానికి బల్బు గుర్తుపై నొక్కండి. దీంతో మీకు లైట్ అడ్జస్ట్ అవుతుంది. మీకు సరిపడే కాంతి వచ్చేవరకూ దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి.
కాగా, వాట్సాప్‌లో లైట్ మోడ్ iOS, Android వెర్షన్లలో అందుబాటులో ఉంది. Windows Whatsapp యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే, వినియోగదారులు ఇప్పటికీ వారి వీడియో కాల్స్ కోసం బ్రైట్ నెస్ స్థాయిలను సర్దుబాటు చెయ్యొచ్చు. ప్రతి కాల్‌కు తక్కువ లైట్ మోడ్‌ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీన్ని శాశ్వతంగా ఎనేబుల్ చేసి ఉంచే ఆప్షన్ లేదు.