VPN Regularization in India: వీపీఎన్ యాప్‌లపై భారత ప్రభుత్వం పెద్ద చర్య తీసుకుంది. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌ల్లో నుంచి అనేక వీపీఎన్ యాప్‌లను తీసివేయమని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో చాలా ఫేమస్ అయిన క్లౌడ్‌ఫ్లేర్ వీపీఎన్ 1.1.1.1, అనేక ఇతర వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (VPN) ఉన్నాయి. ఈ వీపీఎన్ యాప్‌లను తీసివేయడం వెనుక చట్టపరమైన ఉల్లంఘనలే కారణమని నివేదికల్లో పేర్కొన్నారు.


టెక్ క్రంచ్‌లో వచ్చిన కథనం ప్రకారం ఈ యాప్‌లను తొలగించాలని భారత హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యాపిల్ తన యాప్ డెవలపర్‌లకు పంపిన సందేశంలో హోం మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి వచ్చిన "డిమాండ్" గురించి ప్రస్తావించింది.


డెవలపర్ కంటెంట్ భారత చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కేంద్రం ఆరోపించింది. అయితే మంత్రిత్వ శాఖ లేదా టెక్ దిగ్గజాలు యాపిల్, గూగుల్, క్లౌడ్‌ఫేర్ దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. వీపీఎన్ యాప్‌ల కోసం అనేక నియమాలను ప్రభుత్వం సెట్ చేసింది.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


వీపీఎన్ ప్రొవైడర్లు ఈ నియమాలను పాటించాలి
ఈ నియమాల్లో వీపీఎన్ ప్రొవైడర్లు, క్లౌడ్ సర్వీస్ ఆపరేటర్లు తమ వినియోగదారుల వివరణాత్మక రికార్డులను ఉంచడం తప్పనిసరి చేశారు. వీటిలో అడ్రెస్, ఐపీ అడ్రెస్, ఐదు సంవత్సరాల ట్రాన్సాక్షన్ హిస్టరీ వంటివి ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం పైన తెలిపిన వివరాలను కంపెనీలు స్టోర్ చేయాలి. అవసరమైనప్పుడు ప్రభుత్వ ఏజెన్సీకి అందుబాటులో ఉంచాలి.


పెద్ద వీపీఎన్ యాప్ ప్లేయర్ల నిరసన
పెద్ద వీపీఎన్ యాప్ ప్లేయర్‌లు ఈ నియమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. NordVPN, ExpressVPN SurfShark, ProtonVPN వంటి ఇండస్ట్రీ ప్లేయర్‌లు దీనిని వ్యతిరేకించారు. భారతదేశ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలకు ప్రతిస్పందిస్తూ అనేక ప్రముఖ వీపీఎన్ ప్రొవైడర్లు దేశం నుంచి తమ సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపసంహరించుకునే ప్రణాళికలను ప్రకటించారు. నార్డ్ వీపీఎన్, ఎక్స్‌ప్రెస్‌వీపీఎన్, సర్ఫ్ షార్క్ వంటి యాప్‌లు ఇప్పటికీ భారతీయ కస్టమర్‌లకు సేవలను అందించడం కొనసాగిస్తున్నాయి.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?